Eluru: అనధికారిక బాణాసంచా విక్రయాలపై కఠిన చర్యలు

Eluru: దీపావళి వేళ నిబంధనలు ఉల్లంఘించే బాణాసంచా విక్రేతలపై కఠిన చర్యలు ఉంటాయని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ హెచ్చరిక.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Nov 2026 11:07 PM IST
Eluru
X

Eluru: అనధికారిక బాణాసంచా విక్రయాలపై కఠిన చర్యలు

ఏలూరు: దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో అనధికారికంగా బాణాసంచా విక్రయించే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు.పండుగ వేళ ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తో కలిసి కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.బాణాసంచా దుకాణాల అనుమతులు, భద్రతా ప్రమాణాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.

సమీక్షా సమావేశంలో కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ బాణాసంచా విక్రయదారులు,నిల్వదారులు ఖచ్చితంగా అధికారిక లైసెన్స్ లు కలిగి ఉండాలి. ప్రతీ దుకాణదారుడు తమ లైసెన్స్ కాపీని దుకాణం ముందు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి అని అగ్నిప్రమాదాలను నిరోధించేందుకు వీలుగా ప్రతీ దుకాణం వద్ద ఇసుక బకెట్లు, నీరు వంటి అత్యవసర వస్తువులను తప్పనిసరిగా సిద్ధంగా ఉంచుకోవాలి అని మండలాల వారీగా తహసీల్దార్,ఎంపీడీఓ,స్థానిక పోలీస్ అధికారులు ఉమ్మడి బృందాలుగా ఏర్పడి తమ పరిధిలోని బాణాసంచా నిల్వలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి అని తెలిపారు.

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా విక్రయించే వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ నిల్వలు,అనధికార విక్రయాలు జరగకుండా నిఘా ఉంచాలని పోలీసు అధికారులను ఆదేశించారు.దీపావళి సమయంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ప్రజలందరూ సురక్షితంగా,ప్రమాదరహితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకాంక్షించారు.ఈ టెలి కాన్ఫరెన్స్ సమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ,నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి,ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న,రమణలతో పాటు జిల్లాలోని తహసీల్దార్లు,ఎంపీడీఓలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్