Eluru: ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్!

Eluru: ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్. పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Nov 2026 2:17 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్!

Eluru: స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు నగరంలోని పలు పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రక్రియను ఆదివారం కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాలలో పోలింగ్ ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు.

పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ఓటు హక్కును వినియోగించుకోడానికి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటుహక్కు పునాది వంటిదని,ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషిచేయాలన్నారు.జిలాల్లోని ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు,జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుందన్నారు.

పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు సిసి కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని,5 గంటల లోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లకు స్లిప్పులను అందించి వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ సిబ్బంది చర్యలు తీసుకుంటారన్నారు.

ఏలూరు నగరంలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నగరపాలక సంస్థ ఉర్దూ ప్రాధమిక పాఠశాల, ఏ .ఆర్.డి.జి.కె. పాఠశాల, సి.ఎస్.ఐ.ఇంగ్లీష్ మీడియం పాఠశాల వెన్నవల్లివారిపేట లోని డా.బి.ఆర్.అంబేద్కర్ నగరపాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వయోవృద్ధులు,దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసు సిబ్బంది సహకారం అందించారు.కలెక్టర్ వెంట ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ.భానుప్రతాప్,డిఎస్పి శ్రావణ్ కుమార్,ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్