Eluru: ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఎన్నికలు: ఏలూరు కలెక్టర్

Eluru: ఏలూరు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Oct 2026 11:39 PM IST
Eluru
X

Eluru: ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఎన్నికలు: ఏలూరు కలెక్టర్

Eluru: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశపు హాలులో గురువారం సాయంత్రం నగరపాలక,పురపాలక సంఘాల ఎన్నికల ఏర్పాట్లపై ఏలూరు నగరపాలక సంస్థ సిబ్బంది,జంగారెడ్డిగూడెం,నూజివీడు,చింతలపూడి పురపాలక సంఘాల అధికార్లతో జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ నుండి ఏలూరు నగరపాలక సంస్థ, జిల్లాలోని పురపాలక సంఘాల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా నామినేషన్ ప్రక్రియ నుండి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు.

అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని,నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల వరకు మాత్రమే వాహనాలు అనుమతి ఉంటుందని,అభ్యర్థితోపాటు నిర్దేశించిన వ్యక్తులను మాత్రమే నామినేషన్ హాలులోకి అనుమతించాలన్నారు.

ఒకేసారి ఎక్కువమంది నామినేషన్ వేసేందుకు వచ్చిన పక్షంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన నిర్వహణా చర్యలు తీసుకోవాలన్నారు.నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని,నిబంధనల మేరకు ఉన్నవాటిని మాత్రమే అనుమతించాలని,బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని, పోలింగ్,కౌంటింగ్ ప్రక్రియల పై సంబంధిత సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ అందించాలన్నారు.

అభ్యర్థుల ఎన్నికల కోసం చేసే ప్రచార,ప్రకటన ఖర్చులను పరిశీలించేందుకు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను,ఎన్నికల ప్రవర్తనా నియమావళికి ఉల్లంఘనలు పరిశీలించేందుకు ఎంసీసీ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.నామినేషన్, పోలింగ్,కౌంటింగ్ కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని,ఆయా ప్రక్రియలను వీడియో కవరేజ్ చేయించాలన్నారు.

మీజిల్లాలోని నగరపాలక, పురపాలక సంఘాల కార్యాలయాలలో ఎన్నికల సమాచారం, మీఫిర్యాదులు నమోదు,తదితరాలకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.నామినేషన్,పోలింగ్,కౌంటింగ్ సమయాలలో ఆయా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఎన్నికల నియమ నిబంధలను ఎన్నికల సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని విధులు నిర్వర్తించాలన్నారు.అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి,ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ.భానుప్రతాప్,డిఎస్పీ శ్రావణ్ కుమార్, ఏలూరు నగరపాలక సిబ్బంది,ప్రభృతులు పాల్గొన్నారు.

అనంతరం ఏలూరు నగరపాలక సంస్థలోని నామినేషన్ స్వీకరణ కేంద్రాలలోని ఏర్పాట్లను ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్ తో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.నూజివీడు, జంగారెడ్డిగూడెం,చింతలపూడి పురపాలక సంఘాలకు చెందిన అధికారులు,ఎన్నికల సిబ్బంది,పోలీసు,ఇతర శాఖల అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్