Eluru: వరద ప్రభావిత 4 మండలాల్లో రేపు పోలింగ్: కలెక్టర్ వెట్రిసెల్వి!

Eluru: ఏలూరు జిల్లాలో 23 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మురసు తుఫాను వరదల వల్ల మిగిలిన 4 మండలాల్లో శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Nov 2026 11:10 PM IST
Eluru
X

Eluru: వరద ప్రభావిత 4 మండలాల్లో రేపు పోలింగ్: కలెక్టర్ వెట్రిసెల్వి!

ఏలూరు: ఏలూరు జిల్లాలో 23 మండలాల్లో జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు సర్ సి. ఆర్. రెడ్డి పాలిటెక్నీక్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలల్లో గురువారం రాత్రి జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ తో కలిసి కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో 23 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించామన్నారు.

జిల్లాలో మురసు తుఫాన్ కారణంగా జల్లేరు,కొవ్వాడ, ఎర్రకాల్వ జలాశయాలలో పరిధిలో నీరు పొంగి రహదారి సౌకర్యం లేకపోవడంతో వేలేరుపాడు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లోని 4 జడ్పీటీసీ, 42 ఎంపీటీసీ స్థానాలకు 140 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈనెల 6వ తేదీన పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. పోలింగ్ సిబ్బంది, పోలింగ్ సామగ్రితో ఇప్పటికే సదరు మండలాల్లోని పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారన్నారు.

సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని, ఆయా ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీసు సిబ్బంది,జిల్లా యంత్రాంగం సమన్వయంతో విజయవంతంగా ఎన్నికలను నిర్వహించామన్నారు. పోలింగ్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ జిల్లా కలెక్టర్ కృతఙ్ఞతలు తెలియజేసారు. ఈనెల 7వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం అవుతామన్నారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేశామని, పోలీసు సిబ్బంది రోజులతరబడి విధులు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసు సిబ్బంది స్ఫూర్తిదాయమైన పనితీరుతో జిలాల్లో ఏ చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకున్నామన్నారు.

పోలింగ్ స్టేషన్లలో సిసి కెమెరాలు, వెబ్ కాస్టింగ్ తో పాటు పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసు సిబ్బంది బాడీ కెమెరాలతో విధులు నిర్వహిస్తూ, మైక్ ల ద్వారా ఎన్నికల నిబంధనలపై ప్రజలకు పోలింగ్ స్టేషన్ల వద్ద అవగాహన కలిగించారన్నారు. బుధవారం బుట్టాయిగూడెం మండల పరిధిలో వరదల కారణంగా బ్రిడ్జ్ పై రోడ్డు కొట్టుకునిపోయిన కారణంగా 22 మంది కూలీలు చిక్కుకుపోయారని, పోలీస్ సిబ్బంది వారిని రక్షించరన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న,డిఎస్పీ శ్రావణ్ కుమార్ ప్రభృతులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్