Eluru: జూలై 30న ఏలూరు కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి: సీఐటీయూ!

Eluru: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ఆగ్రహం. జూలై 30న ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని యర్నం సాయికిరణ్ పిలుపు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 17 July 2026 4:28 PM IST
Eluru
X

Eluru: జూలై 30న ఏలూరు కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి: సీఐటీయూ!

Eluru: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకుని, కార్మికులకు గౌరవప్రదమైన జీవనం కల్పించే విధంగా కనీస వేతనాలను పెంచాలని, కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి యర్నం సాయికిరణ్ డిమాండ్ చేశారు.

శుక్రవారం కుక్కునూరు మండల కేంద్రంలోని సుందరయ్య భవనం ప్రజా సంఘాల కార్యాలయంలో బాడీస సుజాత అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, విద్య, వైద్యం, రవాణా తదితర ఖర్చులకు అనుగుణంగా కార్మికుల వేతనాలు లేకపోవడంతో అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని అన్నారు.

దేశవ్యాప్తంగా కార్మికులకు గౌరవప్రదమైన జీవితం కల్పించేందుకు భారత కార్మిక సదస్సు సిఫారసు చేసిన కనీస వేతనాలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నాలుగు లేబర్ కోడ్‌ల ద్వారా కార్మికులకు ఉన్న అనేక చట్టబద్ధ హక్కులను బలహీనపరుస్తూ, యజమానులకు అనుకూలంగా చట్టాలను మార్చడం దుర్మార్గమని అన్నారు.

సమాన పనికి సమాన వేతనం, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులను పరిరక్షించే విధానాలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. దేశ సంపదను సృష్టించే కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యత అని, కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కార్పొరేట్ సంస్థలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో జూలై 30న ఏలూరు కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు షేక్ వలిపాషా, కారం రాజేశ్వరి, పోచారపు వెంకటేశ్వర్లు, దార కృష్ణ, కారం నాగలక్ష్మి, కాక కమల, గొంది దుర్గమ్మ, తదితరులు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story