Unguturu: కూటమి రెండేళ్ల పాలనపై ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు హర్షం

Unguturu: ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం జరిగింది.

ADAPA BALA BALAJI, UNGUTURU
Published on: 12 Jun 2026 5:08 PM IST
Unguturu
X

Unguturu: కూటమి రెండేళ్ల పాలనపై ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు హర్షం

ఉంగుటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో రాక్షస పాలనకు ముగింపు పలికి సుపరిపాలనకు శ్రీకారం చుట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించిందని అన్నారు.

ఉంగుటూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సేవల మెరుగుదలలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, కక్షసాధింపు రాజకీయాలు, పరిపాలనా వైఫల్యాలతో రాష్ట్రం చీకటి రోజులను ఎదుర్కొందని విమర్శించారు. విద్యార్థులు, యువత, రైతులు, ఉద్యోగులు, మహిళలు, బలహీన వర్గాలు సహా ఏ ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని అన్నారు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యంగా ఉండగా, సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అసమర్థ నాయకత్వం కారణంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ వంటి కీలక ప్రాజెక్టులు తీవ్రంగా వెనుకబడ్డాయని, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు దూరమయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు.

ఈ పరిస్థితులను గమనించిన ప్రజలు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారని తెలిపారు. ప్రజల నమ్మకానికి అనుగుణంగా ప్రభుత్వం విద్యార్థులు, రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా కొనసాగుతోందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి మరియు పోలవరం నిర్మాణ పనుల వేగవంతం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు, సంక్షేమ పథకాల సమర్థ అమలు, గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన వ్యవస్థల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వివరించారు.

ప్రజా వ్యతిరేక విధానాలతో ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టిన వైసీపీ, ప్రస్తుతం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ‘‘ప్రజలను మోసం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ప్రజల మద్దతు కోల్పోయిన వైసీపీ నేడు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదం’’ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పరిపాలనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆశీర్వాదంతో మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు స్పష్టం చేశారు.

ADAPA BALA BALAJI, UNGUTURU

ADAPA BALA BALAJI, UNGUTURU

Next Story