Eluru: ఏలూరు జిల్లాలో విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు!

Eluru: ఏలూరు జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు, నూజివీడు పట్టణంలోని పలు బియ్యం దుకాణాలపై విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి 3 దుకాణాలపై 7 కేసులు నమోదు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Nov 2026 9:15 PM IST
Eluru
X

Eluru: ఏలూరు జిల్లాలో విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు!

ఏలూరు: ఏలూరు జిల్లాలో విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు నిత్యావసర సరుకుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్న మూడు బియ్యం దుకాణాలపై ఏడు కేసులు నమోదు. ఎల్-నినో పరిస్థితులను సాకుగా చూపుతూ బియ్యం, పప్పులు, వంటనూనెలు మరియు కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది.

సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరలలో లభించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా విజిలెన్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో, ఏలూరు రీజినల్ విజిలెన్స్ అధికారి కె.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు నేడు మెరుపు దాడులు నిర్వహించారు.

పెదపాడు మండలం అప్పనవీడు గ్రామం మరియు నూజివీడు పట్టణంలోని పలు బియ్యం దుకాణాలలో విజిలెన్స్,పౌరసరఫరాలు,మరియు తూనికలు కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో అనేక ఉల్లంఘనలు వెలుగుచూశాయి. బియ్యం సంచులపై ముద్రించిన గరిష్ట చిల్లర ధర, అంటే ఎం.ఆర్.పి వివరాలను స్టిక్కర్లతో మార్చడం, ప్యాకింగ్ లైసెన్స్ లేకపోవడం, ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉండటం, మరియు తయారీదారు లేదా ప్యాకర్ చిరునామా వివరాలు ముద్రించకపోవడం వంటి అక్రమాలను అధికారులు గుర్తించారు.

ఈ ఉల్లంఘనలకు పాల్పడిన మూడు దుకాణాలపై తూనికలు కొలతల చట్టం ప్రకారం మొత్తం ఏడు కేసులు నమోదు చేశారు. వీటిలో సరోజినీ ఎంటర్‌ప్రైజెస్‌పై రెండు కేసులు, శ్రీ లలిత దత్త మార్ట్‌పై ఒక కేసు, మరియు శ్రీ రామ ట్రేడర్స్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఏలూరు రీజినల్ విజిలెన్స్ అధికారి కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎవరైనా నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. నేటి తనిఖీలలో విజిలెన్స్ డి.ఎస్.పి సింగులూరి వెంకటేశ్వరరావు,ఏ.ఓ జి. మీరయ్య,ఇన్‌స్పెక్టర్ డి. ప్రసాద్ కుమార్, ఏ.జి పి.శ్రీధర్ మరియు తూనికలు కొలతల అధికారి జి.వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్