Eluru: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఘనంగా న్యాయ సేవాధికార దినోత్సవం
Eluru: ఏలూరులో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార దినోత్సవం. జిల్లా జడ్జి ఎస్. శ్రీదేవి ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలు, లోక్ అదాలత్ గణాంకాల వెల్లడి.
Eluru: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఘనంగా న్యాయ సేవాధికార దినోత్సవం
ఏలూరు: జాతీయ,రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో న్యాయ సేవాధికార దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు సంస్థ చైర్పర్సన్ ఎస్.శ్రీదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి ఎస్.శ్రీదేవి మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ నుండి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సేవా వివరాలను వెల్లడించారు.
15100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా 4000 మందికి పైగా ఉచిత న్యాయ సలహాలు అందించారు.మరో 176 మందికి ఉచిత న్యాయ సహాయం లభించింది.గత మూడు జాతీయ లోక్ అదాలత్‌లలో 24 వేలకు పైగా కేసులను రాజీ మార్గంలో పరిష్కరించి,రూ. 132 కోట్ల పరిహారం అందించారు.396 ప్రీ-లిటిగేషన్ కేసులు పరిష్కరించి,రూ. 36 లక్షలకు పైగా పరిహారం ఇప్పించారు.
ఆర్థికంగా వెనుకబడి పూచీకత్తు సమర్పించలేని 26 మంది ఖైదీలను ప్రభుత్వ సహకారంతో విడుదల చేశారు.జిల్లాలోని 102 మంది ట్రైనీ మీడియేటర్ల ద్వారా 1427 కేసుల్లో మధ్యవర్తిత్వం వహించి,247 కేసులను విజయవంతంగా పరిష్కరించారు.బాధితుల పరిహారం కింద రూ. 1,25,55,000 ప్రకటించారు.
గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ సహాయం కోసం 17 లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు,విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో లీగల్ ఎయిడ్ క్లబ్‌లను ఏర్పాటు చేశారు.ప్రజలందరూ ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో 1వ అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని,5వ అదనపు జిల్లా జడ్జి ఆర్.వి.వి.ఎస్.మురళీకృష్ణ,8వ అదనపు జిల్లా జడ్జి ఐ. శ్రీనివాస మూర్తి, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఎ. మేరీ గ్రేస్ కుమారి,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, టౌన్ డిఎస్పి డి. శ్రావణ్ కుమార్, డిఆర్ఓ ఎం. ముక్కంటి, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.




