Eluru: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు: పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై జేసీ సమీక్ష

Eluru: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను జేసీ డాక్టర్ అభిషేక్ గౌడ తనిఖీ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 19 Oct 2026 11:50 PM IST
Eluru
X

Eluru: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు: పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై జేసీ సమీక్ష

ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ,స్ట్రాంగ్ రూంలు మరియు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డా.ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.

స్థానిక సర్ సి.ఆర్.రెడ్డి పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేస్తున్న పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాన్ని, అలాగే సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాలెట్ బాక్సుల భద్రత కోసం సిద్ధం చేస్తున్న స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాల పనులను సోమవారం ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని సజావుగా అందజేసేందుకు వీలుగా సర్ సి.ఆర్.రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో తగినన్ని టేబుళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అకాల వర్షాలు కురిసినా మెటీరియల్ తడిసిపోకుండా ఉండేలా పంపిణీ కేంద్రాల వద్ద వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని స్పష్టం చేశారు.

డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలతో పాటు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సిసి కెమెరాలను అమర్చాలని, పూర్తిస్థాయిలో వీడియో చిత్రీకరణ చేయించాలని ఆదేశించారు.స్ట్రాంగ్ రూమ్‌లలో బ్యాలెట్ బాక్సులను క్రమపద్ధతిలో భద్రపరిచేందుకు వీలుగా ప్రతి బాక్స్‌కు నిర్దేశిత నెంబర్లతో మార్కింగ్ చేయించాలన్నారు.

కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల సంఖ్యకు అనుగుణంగా లెక్కింపు టేబుళ్లను సిద్ధం చేయాలని జేసీ పేర్కొన్నారు. కౌంటింగ్ సిబ్బంది, రాజకీయ పక్షాల ప్రతినిధులు రాకపోకలు సాగించడానికి వేర్వేరుగా ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు.

భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు జరిగే అన్ని కేంద్రాల వద్ద సిసి కెమెరాల నిఘాతో పాటు వీడియో చిత్రీకరణ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో జేసీ వెంట అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ ఎం. కృష్ణమోహన్, నగరపాలక సంస్థ కమీషనర్ ఏ. భానుప్రతాప్, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డిఎస్పీ శ్రావణ్ కుమార్, అలాగే రెవిన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్