Velerupadu: వేలేరుపాడులో రాజకీయ ఉద్రిక్తత.. వైసీపీ నేతపై దాడి కలకలం!

Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడులో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మండల కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్‌పై దాడి, మెడికల్ షాప్ అద్దాల ధ్వంసంపై ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 25 Nov 2026 8:57 AM IST
Velerupadu
X

Velerupadu: వేలేరుపాడులో రాజకీయ ఉద్రిక్తత.. వైసీపీ నేతపై దాడి కలకలం!

వేలేరుపాడు: మండల కేంద్రంలోని చౌరస్తాలో వైసీపీ మండల కన్వీనర్ కేసుగాని శ్రీనివాస్ గౌడ్‌పై దాడి జరిగిందన్న ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి కారులో బయలుదేరిన సమయంలో సుమారు పది మందికి పైగా టీడీపీకి చెందిన వ్యక్తులు తన కారును అడ్డగించి దారి ఇవ్వలేదని, కారు దిగి దారి ఇవ్వాలని కోరడంతో తనపై దాడికి పాల్పడ్డారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న వైసీపీ యువకులు జోక్యం చేసుకుని తనను విడిపించారని తెలిపారు.

మెడికల్ షాప్‌పై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం

ఈ ఘటనతో పాటు నాగేంద్ర అనే వ్యక్తికి చెందిన మెడికల్ షాప్‌పై కూడా రాళ్లు రువ్వి అద్దాలను ధ్వంసం చేశారని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చౌరస్తాలో వైసీపీ నాయకుల ధర్నా

తనపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు వేలేరుపాడు చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అనంతరం వేలేరుపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఇరువర్గాల పరస్పర ఫిర్యాదులు

మరోవైపు కేసుగాని శ్రీనివాస్ గౌడ్‌పై కూడా దాడి చేశారంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం మండలంలో రాజకీయ చర్చకు దారితీసింది. అసలు ఘటనలో ఏం జరిగింది? ఎవరి వాదనలో వాస్తవాలు ఉన్నాయన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి!

ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా పోలీసులు, సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రాజకీయ విభేదాలు వ్యక్తిగత దాడులకు, ఆస్తుల ధ్వంసానికి దారితీయకుండా ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలకు తగిన అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మళ్లీ ఘర్షణలు జరగకుండా పోలీసుల నిఘా అవసరం!

మండలంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇరువర్గాల ఫిర్యాదులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, తప్పు చేసినట్లు తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR