Eluru: వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రతా చర్యలు - కలెక్టర్, ఎస్పీ
Eluru: ఏలూరులో వినాయక నిమజ్జన ఏర్పాట్లపై కలెక్టర్ అభిషేక్ గౌడ, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సమీక్ష. ఘాట్ల వద్ద పటిష్ట భద్రతకు ఆదేశాలు.
Eluru: వినాయక నిమజ్జనానికి పటిష్ట భద్రతా చర్యలు - కలెక్టర్, ఎస్పీ
ఏలూరు: ఏలూరు జిల్లాలో వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు.జిల్లాలో వినాయకచవితి ఉత్సవాలు, నిమజ్జన సమయంలో తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి కలెక్టరేట్ నుండి మంగళవారం సంబంధిత శాఖల జిల్లా అధికారులు,తహసీల్దార్లు,ఎంపిడిఓ లతో ఇంచార్జ్ కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా అభిషేక్ గౌడ మాట్లాడుతూ వినాయకచవితి ఉత్సవాల సమయంలో ముఖ్యంగా నిమజ్జన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.డివిజినల్ స్థాయి రెవిన్యూ అధికారులు తహసీల్దార్లు,ఎంపీడీఓలతో సమీక్షించి గ్రామ స్థాయిలలో కమిటీలను ఏర్పాటుచేసి, వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో నీటి ప్రమాదాలు,బాణాసంచా,విద్యుద్ఘాతం, వంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
నిమజ్జనాలు జరిగే పెద్ద ఘాట్ల వద్ద నీటిలోకి యువతను అనుమతించకుండా క్రేన్ల ద్వారా నిమజ్జన కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఘాట్ల వద్ద తప్పనిసరిగా బారికేడ్లు,విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలన్నారు.ఎంపిడిఓ లు తమ పరిధిలో నిమజ్జనాలు చేసే ప్రదేశాలలో భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించాలని,పర్యవేక్షణలోపం కారణంగా ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేతే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని హెచ్చరించారుఅనుమతి లేకుండా బాణాసంచా అనధికార నిల్వలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.ఒకేరోజు ఎక్కువ సంఖ్యలో నిమజ్జనాలు జరగకుండా చూడాలన్నారు. బెల్ట్ షాపుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జన సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఘాట్ల వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. బారికేడ్లు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని,భారీ విగ్రహాలు నిమజ్జన సమయంలో క్రేన్లు ఉపయోగించేలా చూడాలన్నారు.ఘాట్ల వద్ద లైటింగ్ ఏర్పాట్లతోపాటు నిమజ్జన ప్రదేశంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు గతంలో బాణాసంచా అమ్మకాల నిమిత్తం తాత్కాలిక లైసెన్స్ లు పొందిన వారి ఇళ్లను తనిఖీ చేసి,బాణాసంచా నిల్వ ఉంటె,వాటిని సీజ్ చేసి కేసులు నమోదు చేయాలన్నారు.
నిమజ్జన సమయంలో పెద్దఎత్తున డి.జె.శబ్దాలు లేకుండా చూడాలన్నారు.నిమజ్జన ప్రదేశంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా ఉండేలా మండల జాయింట్ ఇన్స్పెక్షన్ బృందాలు పరిశీలించాలన్నారు.ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.ఒకేచోట నిమజ్జనం చేసేందుకు ప్రయత్నిస్తే రద్దీ పెరిగి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున,నిమజ్జనానికి వివిధ ప్రాంతాలను గుర్తించి, నిమజ్జనం చేసేలా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న,ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న,రమణ,డిఎస్పీ లు,తహసీల్దార్లు,ఎంపిడిఓలు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




