Kukunoor: తొలిరోజు బోసిపోయిన కేంద్రాలు.. రెండో రోజు పోటాపోటీగా నామినేషన్లు!

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తొలిరోజు ఆదివారం ఒక్క నామినేషన్ పడకపోగా, రెండో రోజు సోమవారం సర్పంచ్, వార్డు స్థానాలకు 241 నామినేషన్లు దాఖలయ్యాయి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 16 Nov 2026 8:30 PM IST
Kukunoor
X

Kukunoor: తొలిరోజు బోసిపోయిన కేంద్రాలు.. రెండో రోజు పోటాపోటీగా నామినేషన్లు!

కుక్కునూరు: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. తొలిరోజు నామినేషన్లు లేక వెలవెలబోయిన కేంద్రాలు.. రెండో రోజు అభ్యర్థుల రాకతో సందడిగా మారాయి. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్ల స్వీకరణ కోసం అధికారులు కుక్కునూరు మండలంలో 9, వేలేరుపాడు మండలంలో 6 చొప్పున మొత్తం 15 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు ఆదివారం కావడంతో రెండు మండలాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో అభ్యర్థుల సందడి లేక నామినేషన్ కేంద్రాలు బోసిపోయాయి.

ఇక రెండో రోజు మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. కుక్కునూరు మండలంలోని 15 సర్పంచ్ స్థానాలకు 30 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వార్డు సభ్యుల స్థానాలకు 106 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.

అటు వేలేరుపాడు మండలంలోని 9 సర్పంచ్ స్థానాలకు 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వార్డు సభ్యుల స్థానాలకు 90 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

వెరసి.. రెండు మండలాల్లో రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 45, వార్డు సభ్యుల స్థానాలకు 196 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 241 నామినేషన్లు నమోదయ్యాయి.

తొలిరోజు నామినేషన్లు నమోదు కాలేదు. కానీ రెండో రోజు మాత్రం భారీ స్పందన కనిపించింది. దీంతో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పంచాయతీ ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR