Chintoor: వరద ఉధృతిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్!

Chintoor: భారీ వర్షాలు, శబరి-గోదావరి వరద ఉధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె.దినేష్ కుమార్ కోరారు. 135 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 26 Sept 2026 5:46 PM IST
Chintoor
X

Chintoor: వరద ఉధృతిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్!

Chintoor: భారీ వర్షాల నేపథ్యంలో శబరి, గోదావరి నదుల వరద ఉదృతి పై ప్రజలు రానున్న 24 నుంచి 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ కోరారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.శనివారం చింతూరు డివిజన్ పరిధిలోని చింతూరు, కూనవరం,వి.ఆర్.పురం ప్రాంతాల్లో కలెక్టర్ కె.దినేష్ కుమార్, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్, చింతూరు సబ్ కలెక్టర్ శుభం నొక్వల్, ఓ ఎస్ డి జావలి ఇతర అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించి,వరద ప్రభావం, రహదారులు, రాకపోకలు, ప్రజల భద్రత, పునరావాస ఏర్పాట్ల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురవడం, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు శబరి నది పరివాహక ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదవడంతో శబరి నదికి భారీగా వరద ప్రవాహం వచ్చిందని కలెక్టర్ తెలిపారు.

గతంలో 1986లో నమోదైన సుమారు 5.4 లక్షల క్యూసెక్కుల చారిత్రాత్మక వరదను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ముందుగానే అప్రమత్తమై చర్యలు చేపట్టిందన్నారు.చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 41.50 అడుగులకు చేరిందని,ఇది సుమారు 3.5 నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహానికి సమానమని తెలిపారు.ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ అక్కడి వరద నీరు దిగువ ప్రాంతాలకు చేరడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.

వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో పోలీసు, రెవెన్యూ, ఐటీడీఏ, పంచాయతీరాజ్ తదితర శాఖల సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ మైకుల ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.చింతూరు డివిజన్‌లో సుమారు 135 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, 161 గ్రామాల్లో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో 124 మంది గర్భిణీలను గుర్తించి, ప్రసవ సమయం సమీపించిన 10 మందికి పైగా గర్భిణీలను ముందుగానే ప్రసవ కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు.

అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా వైద్య ఆరోగ్య శాఖ బృందాలను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు.రానున్న 24 నుంచి 48 గంటలు అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు.సాయంత్రం నుంచి గోదావరి నీటిమట్టం కూడా పెరిగే అవకాశం ఉన్నందున మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.గోదావరి ప్రవాహం పెరిగినప్పుడు శబరి వరద నీరు దిగువకు వెళ్లే వేగం తగ్గి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయిన గ్రామాల్లోని ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని బియ్యం, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వంటనూనె తదితర నిత్యావసర సరుకులను బాధిత ప్రజలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.క్షేత్రస్థాయి పర్యటనలో వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజల తరలింపు, పునరావాసం, ఆహారం, తాగునీరు, వైద్య సేవలు వంటి అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు నివారించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR