Polavaram: వర్షాకాలంలో గోదావరిలోకి వెళ్లొద్దు.. కలెక్టర్ హెచ్చరిక

Polavaram: గోదావరి నది ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు గిరిజనుల కుటుంబాలకు రూ25 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం ప్రకటించిన పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్.

Prasanna, Rampachodavaram
Published on: 19 July 2026 8:15 AM IST
Polavaram
X

Polavaram: వర్షాకాలంలో గోదావరిలోకి వెళ్లొద్దు.. కలెక్టర్ హెచ్చరిక

Polavaram: గోదావరి నదిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు గిరిజనుల కుటుంబాలకు తక్షణ సహాయంగా ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున జిల్లా యంత్రాంగం ద్వారా ఆర్థిక సాయం అందజేసినట్లు పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన పూర్తి పరిహారం, ఇతర సంక్షేమ ప్రయోజనాలను కూడా అత్యవసరంగా అందించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు నిరంతరం అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్దినేష్ కుమార్ మాట్లాడుతూ, వర్షాకాలంలో గోదావరి నదిలో నీటి మట్టం, ప్రవాహం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉన్నందున గిరిజనులు, మత్స్యకారులు, నదిపై ఆధారపడి జీవించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖలు జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న సమయంలో చేపల వేటకు లేదా ఇతర అవసరాల కోసం నదిలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల ప్రాణ భద్రతకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రమాదకర పరిస్థితులను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక రెవెన్యూ, పోలీసు లేదా విపత్తు నిర్వహణ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story