Eluru: భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక వణికిపోతున్న ముంపు గ్రామాలు!

Eluru: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు విలీన మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 1 Aug 2026 11:35 AM IST
Eluru
X

Eluru: భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక వణికిపోతున్న ముంపు గ్రామాలు!

Eluru: ఏలూరుజిల్లా కుక్కునూరు, వేలేరుపాడు విలీన మండలాల్లోఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. కొద్దిపాటి వరదకే పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న అనేక గ్రామాలు మునిగిపోతున్నాయి.

గోదావరికి వరద ఉధృతి పెరగడంతో వేలేరుపాడు మండలంలో 15 గ్రామాలు, కుక్కునూరు మండలంలో 3 గ్రామాలను నీరు చుట్టిముట్టింది. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుక్కునూరు మండలంలో గుండేటివాగు బ్రిడ్జిపైకి వరద నీరు చేరుకోవడంతో దాచారం, గొమ్ముగూడెం పంచాయతీల పరిధిలో దాదాపు 10 గ్రామాలకు రోడ్డు మార్గం మునిగిపోయి రాకపోకలు బంద్‌ అయ్యాయి.

గొమ్ముగూడెం గ్రామం చుట్టూ గోదావరి వరద నీరు చేరడంతో గొమ్ముగూడెం గ్రామంలోని బాధిత కుటుంబాలను రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సీతారామ నగరం గ్రామం చుట్టూ వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తి అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా ముత్యాలంపాడు, వింజరం గ్రామాల మధ్య ఉన్న పాలవాగులోకి గోదావరి వరద నీరు చేరడంతో పాలవాగు పొంగి ముత్యాలంపాడు వింజరం గ్రామాల మధ్య రోడ్డు పూర్తిగా నీట మునిగింది.

మాధవరం పంచాయతీ పరిధిలోని కౌoడిన్యముక్తి గ్రామం చుట్టూ వరదనీరు చేరడంతో గ్రామస్తులు ఇళ్లకే పరిమితమై బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట ముంపు గ్రామంలోని ప్రజలు ఎత్తయిన ప్రాంతాల్లో కొండలపై సొంతంగా ఏర్పాటుచేసుకున్న గుడిసెల్లో ఆశ్రయం పొందేందుకు తరలివెళ్తున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది . భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది.

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదలతో అత్యంత ప్రమాదకర స్థాయిలో గోదావరి భద్రాచలం వద్ద ప్రవహిస్తోంది. ప్రస్తుతం 55.60అడుగుల చేరుకుంది. భద్రాచలం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరుతుంది.

వేలేరుపాడు మండలంలోని ఎడవల్లి గ్రామం వద్ద ఉన్న ఎద్దు వాగు వంతెన పూర్తిగా వరదనీటిలో మునగటంతో కోయిదా,కట్కూరు, కాక్కిసనూరు,టేకుపల్లి,టేకురు, పేరంటాలపల్లి, కాచారం పంచాయతీల పరిధిలోని 15 ఏజెన్సీ గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించడంతో గిరిజనులు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పంటలు నీట మునిగాయి.

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంటగంటకు గోదావరి ఉధృతి పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకుగురవుతున్నారు. ప్రభుత్వ తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story