Velerupadu: కోయిదా సచివాలయంలో ఖాళీ కుర్చీలే వేలేరుపాడులో పడకేసిన పాలన!
Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని కోయిదా సచివాలయంలో అందుబాటులో లేని ఉద్యోగులు. కిలోమీటర్ల కొద్దీ నడిచొచ్చి ఇబ్బందులు పడుతున్న గిరిజనులు.
Velerupadu: కోయిదా సచివాలయంలో ఖాళీ కుర్చీలే వేలేరుపాడులో పడకేసిన పాలన!
Velerupadu: వేలేరుపాడు మండల పరిధిలోని కోయిదా గ్రామ సచివాలయంలో ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో ఐటీడీఏ పీవో సూచన మేరకు పక్కనే ఉన్న పాఠశాల భవనంలోని ఓ గదిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేసినప్పటికీ, అక్కడ ఉద్యోగులు అందుబాటులో ఉండటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
మొబైల్ సిగ్నల్ కూడా సరిగా లేని ప్రాంతం కావడంతో సచివాలయానికి వెళ్లిన సమయంలో ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. పేరంటాలపల్లి, కాకిసునూరు, టేకూరు తదితర గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి ప్రజలు కూలి పనులు మానుకుని సచివాలయానికి వచ్చినా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు.
సిబ్బంది మొత్తం ఫీల్డ్‌కి వెళ్లారని చెప్పడం, ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లేకపోవడం తమకు సమస్యగా మారిందని గ్రామస్తులు అంటున్నారు. సచివాలయంలో సేవలు అందకపోవడంతో సుమారు 22 కిలోమీటర్ల దూరంలోని వేలేరుపాడు మండల కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెన్షన్ల పంపిణీ సమయంలో ఇద్దరు,ముగ్గురు సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారని, మిగిలిన రోజుల్లో సచివాలయంలో కనీసం ఒక ఉద్యోగి అయినా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయాన్ని ఎంపీడీవో దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ తగిన స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ ఎవరో కూడా తమకు స్పష్టంగా తెలియడం లేదని కొందరు పేర్కొంటున్నారు.
విధులకు హాజరు, ఫీల్డ్ విధులు, సచివాలయంలో అందుబాటు వంటి అంశాలపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని, తప్పిదాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజలకు సచివాలయ సేవలు నిరంతరం అందేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.




