Konaseema: డీజిల్ కొరత లేదు.. కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ స్పష్టత
Konaseema: కోనసీమ జిల్లాలో డీజిల్ సరఫరాపై కలెక్టర్ మహేష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. జిల్లాలో కొరత లేదని, సరఫరాను 10 శాతం పెంచామని తెలిపారు.
Konaseema: డీజిల్ కొరత లేదు.. కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ స్పష్టత
Konaseema: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. గతంలో కంటే సాధారణంగానే సరఫరా జరుగుతున్నప్పటికీ, సామాజిక మాధ్యమాలలో మరియు ఇతర మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ మరియు అసత్య ప్రచారాల వల్ల ప్రజలు భయాందోళనకు గురై, అవసరానికి మించి డీజిల్ ను నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలుగా వ్యవసాయ అవసరాలు ఉన్నాయని జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారితం కావడంతో, ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో కోత యంత్రాలకు ఒక్కసారిగా డీజిల్ అవసరం పెరిగిందన్నారు. ఆక్వాకల్చర్ రంగానికి విద్యుత్ కోతల నేపథ్యంలో రొయ్యల చెరువుల వద్ద ఏరియేటర్స్ నడపడానికి డీజిల్ వినియోగం అధికమైందన్నారు.
ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలను జిల్లాకు సరఫరాను 10 శాతం పెంచాలని ఆదేశించడం అయిందని ఆయన తెలిపారు. ఎక్కడా బంకులు డ్రై అవుట్ కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరి కోత యంత్రాలకు డీజిల్ ఇబ్బంది లేకుండా విలేజ్ అగ్రికల్చరల్ ఆఫీసర్ ధృవీకరణ పత్రం విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు.
రైతులు లేదా ఆపరేటర్లు వి ఏ ఓ ల వద్ద సంతకం తీసుకున్న పత్రాన్ని బంకులో చూపిస్తే ప్రాధాన్యత క్రమంలో డీజిల్ సరఫరా చేస్తారన్నారు. జిల్లావ్యాప్తంగా పలు ప్రభుత్వ ప్రాజెక్టులు,వివిధ నిర్మాణ ప్రాజెక్టులకు ప్రత్యేక కేటాయింపులు చేయడమైనదన్నారు. అవసరమైన వారు జిల్లా సివిల్ సప్లై అధికారి వారిని సంప్రదించ వచ్చునన్నారు. నిత్యావసర సేవలు సరుకులు రేషన్ షాపులకు తరలించే స్టేజ్-2 రవాణా వాహనాలకు ఎటువంటి అంతరాయం లేకుండా డీజిల్ సరఫరా చేయబడుతుందన్నారు.
ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదన్నారు. డీజిల్ సరఫరాలో ఎక్కడైనా సమస్యలు ఎదురైనా లేదా అధిక ధరలకు విక్రయించినా ఫిర్యాదు చేసేందుకు జిల్లా యంత్రాంగం రెండు ప్రత్యేక నంబర్లను ఏర్పాటు చేసిందన్నారు. వాటి సెల్ 90599 20242, 94416 92275 లు ఉన్నాయన్నారు.జిల్లా ప్రజలు, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసు కుందని ఈ ప్రకటన ద్వారా జిల్లా కలెక్టర్ తెలియజేశారు.




