Kukkunoor: వికలాంగ కార్యకర్త సేవలకు గుర్తింపు.. ఎంపీటీసీ సత్కారం

Kukkunoor: కుక్కునూరు–1 ఎంపీటీసీగా గెలిచిన టీడీపీ అభ్యర్థి పిచ్చుక రాజు ఆదర్శం. ప్రచారంలో శ్రమించిన వికలాంగ కార్యకర్త సయ్యద్ యాకూబ్ పాషాను ఘనంగా సత్కరించిన నేత.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 9 Nov 2026 8:39 PM IST
Kukkunoor
X

Kukkunoor: వికలాంగ కార్యకర్త సేవలకు గుర్తింపు.. ఎంపీటీసీ సత్కారం

కుక్కునూరు: ఎన్నికల ప్రచార సమయంలో తన విజయం కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల సేవలను గుర్తిస్తూ కుక్కునూరు–1 ఎంపీటీసీగా విజయం సాధించిన కూటమి టీడీపీ అభ్యర్థి పిచ్చుక రాజు ఆదర్శంగా నిలిచారు. తన గెలుపు కోసం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారంలో పాల్గొన్న వికలాంగ కార్యకర్త సయ్యద్ యాకూబ్ పాషాను సోమవారం తన నివాసంలో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా యాకూబ్ పాషాకు పూలమాల వేసి, శాలువా కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో యాకూబ్ పాషా తన మూడు చక్రాల సైకిల్‌పై గ్రామంలో తిరుగుతూ కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పిచ్చుక రాజుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వర్షంలో సైతం తడుస్తూ ప్రచారంలో పాల్గొని తన అంకితభావాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా పిచ్చుక రాజు మాట్లాడుతూ.. తన విజయానికి కృషి చేసిన యాకూబ్ పాషాతో పాటు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఓటర్ల సేవలను ఎప్పటికీ మరువబోనని పేర్కొన్నారు. తనపై నమ్మకంతో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు.

కార్యకర్తల కష్టాన్ని గుర్తించి, విజయానంతరం వారిని గౌరవించడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన చాటిచెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR