Kukkunuru: కాంటూర్ లెక్కల్లేకుండా నిర్వాసితులందరికీ పరిహారమివ్వాలి
Kukkunuru: పోలవరం నిర్వాసితులందరికీ కాంటూర్ లెక్కలతో సంబంధం లేకుండా పరిహారం చెల్లించాలి: కుక్కునూరు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యర్రంశెట్టి నాగేంద్రరావు డిమాండ్.
Kukkunuru: కాంటూర్ లెక్కల్లేకుండా నిర్వాసితులందరికీ పరిహారమివ్వాలి
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ కాంటూర్ లెక్కలతో సంబంధం లేకుండా నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు యర్రంశెట్టి నాగేంద్రరావు డిమాండ్ చేశారు. సోమవారం కుక్కునూరులోని సుందరయ్య భవనంలో ప్రజా సంఘాల కార్యాలయం వద్ద నిర్వహించిన సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కుక్కునూరు మండలాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి, ఇప్పటివరకు పరిహారం అందని మిగిలిన భూములతో పాటు సాగులో ఉన్న పోడు భూములకు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం అందించాలని కోరారు. చుట్టూ గోదావరి నది ఉండే పరిస్థితుల్లో కాంటూర్ పరిధిలోకి రాని గ్రామాల ప్రజలు ఎలా జీవించాలని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికే నష్టపరిహారం పొందిన కొంతమంది భూయజమానులు ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ తమ భూములను స్థానిక పేద రైతులకు కౌలుకు ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అటువంటి భూములను స్వాధీనం చేసుకుని భూమిలేని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పరిహారం పొందిన భూములను కౌలుకు ఇస్తూ పేద రైతుల నుంచి అధిక మొత్తంలో కౌలు వసూలు చేస్తున్న భూయజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
స్థానిక ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి యర్నం సాయికిరణ్, మండల కమిటీ సభ్యులు షేక్ మహబూబ్ పాషా, సరియం హరినాధ్ తదితరులు పాల్గొన్నారు.




