Kukunoor: ఎన్నికల కోడ్‌లోనూ బెల్ట్ షాపుల దందా.. రూ.60 అదనపు బాదుడు

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఎన్నికల కోడ్ అమలులోనూ బెల్ట్ షాపుల నిర్వహణపై విమర్శలు; రూ.140 సీసాకు రూ.200 వసూలు, తనిఖీలకు ప్రజల డిమాండ్.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 25 Nov 2026 5:44 PM IST
Kukunoor
X

Kukunoor: ఎన్నికల కోడ్‌లోనూ బెల్ట్ షాపుల దందా.. రూ.60 అదనపు బాదుడు

కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో బెల్ట్ షాపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దామరచర్ల గ్రామంలోని ఓ బెల్ట్ షాపులో నవంబర్ 25, బుధవారం సాయంత్రం 4 గంటల 16 నిమిషాలకు మద్యం వినియోగదారులు ఓల్డ్ అడ్మిరల్ బాటిల్ కొనుగోలు చేయగా, దానిపై ఎమ్మార్పీ ధర రూ.140 ఉండగా రూ.200 వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అంటే ఒక్కో బాటిల్‌పై అదనంగా రూ.60 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఉప్పేరు గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్ట్ షాపుల్లో సైతం అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నవంబర్ 24 రాత్రి 9 గంటల నుంచి నవంబర్ 26 సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ సమయంలో బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులు, బార్లు మూసివేయాలని ఎక్సైజ్ అధికారులు సూచించినప్పటికీ కుక్కునూరు మండలంలో బెల్ట్ షాపులు కొనసాగుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలోనూ గ్రామాల్లో బెల్ట్ షాపులు యథేచ్ఛగా నడుస్తుండటంతో అసలు ఎన్నికల నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని పలువురు బాహాటంగానే చెబుతున్నారు.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి దామరచర్లతో పాటు కుక్కునూరు మండలంలోని గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణపై తనిఖీలు చేపట్టాలని, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR