Kukunoor: కుక్కునూరులో రోడ్డు ఆక్రమణలు.. వాహనదారుల అవస్థలు!

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు రింగ్ రోడ్డు సెంటర్‌లో ఆర్‌అండ్ బీ రోడ్డు ఆక్రమణలతో ఇరుకుగా మారిన రహదారి. అధికారుల చర్యలకు స్థానికుల విజ్ఞప్తి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 13 Sept 2026 12:14 PM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరులో రోడ్డు ఆక్రమణలు.. వాహనదారుల అవస్థలు!

Kukunoor: మండల కేంద్రంలోని రింగ్ రోడ్ సెంటర్‌లో రోడ్డు మార్జిన్ల ఆక్రమణలతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి మార్జిన్లను ఆక్రమించి షాపులు నిర్మించడంతో రోడ్డు వెడల్పు తగ్గిపోయి ఎదురుగా వచ్చే వాహనాలు తప్పుకోవడానికి మార్గం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

షాపుల ముందు వాహనాల పార్కింగ్‌తో అంతరాయం..

కుక్కునూరు మండల కేంద్రంలో మండల కార్యాలయాలు ఉండటంతో వివిధ పనుల నిమిత్తం ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రింగ్ రోడ్ సెంటర్‌లోని షాపుల ముందు వాహనాలను నిలిపి షాపుల్లోకి వెళ్లడంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు.

రోడ్డు మార్జిన్ల ఆక్రమణలు, ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్ కారణంగా ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. రహదారి ఇరుకుగా మారడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు తప్పుకోవడానికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

అధికారులు స్పందించాలని ప్రజల విజ్ఞప్తి..

రింగ్ రోడ్ సెంటర్‌లో రోడ్డు మార్జిన్ల ఆక్రమణలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ అధికారులు సంయుక్తంగా పరిశీలించి రహదారి మార్జిన్లలో అనుమతులు లేకుండా నిర్మించిన షాపులు, ఇతర ఆక్రమణలను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అలాగే షాపుల ముందు వాహనాల పార్కింగ్ వల్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి మార్జిన్లను ఆక్రమణల నుంచి విముక్తి చేసి వాహనదారులు, ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR