Kukunoor: కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం ముట్టడించిన గిరిజనులు

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరులో గిరిజనుల భూముల నోటిఫికేషన్‌పై నెమలిపేట రైతుల ఆందోళన. తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 13 Aug 2026 9:38 PM IST
Kukunoor
X

Kukunoor: కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం ముట్టడించిన గిరిజనులు

కుక్కునూరు: ఏలూరు జిల్లా కుక్కునూరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని సుమారు 200 మంది గిరిజన రైతులు చుట్టూ ముట్టారు. పోలవరం జిల్లా, కూనవరం మండలం ,పెద్ద ఆర్కుర్ గ్రామ గిరిజన రైతులకు భూమికి భూమి కింద ఇస్తున్న అర్వపల్లి భూముల నోటిఫికేషన్ పై నెమలిపేట గిరిజన రైతులు ధ్వజమెత్తారు.

తరతరాలుగా భూమిని నమ్ముకొని సాగు చేస్తున్న మా భూములపై కొంతమంది పెత్తందారులు అడ్డదారిలో పట్టాలు చేయించుకుని అమాయకులైన గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని,వారికి కొంత మంది అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

అరువాయిపల్లి రెవిన్యూ లో ఉన్న 216 ఎకరాలకు పైగా భూమిని తరతరాలుగా నెమలిపేట గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. కానీ గిరిజనేతరుల పేర్ల మీద పట్టాలు చేయించుకున్నారు. ఇటీవల అధికారులు సర్వే చేస్తున్న విషయాన్ని తెలుసుకుని అక్కడికి చేరుకున్న గిరిజన రైతులు మాకు చెప్పకుండా ఎలా సర్వే చేస్తున్నారని అధికారులను నిలదీశారు. పిసా చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

మామూలుగా సర్వే చేస్తున్నాము. గ్రామ సభలు పెట్టిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని నమ్మబలికిన అధికారులు అకస్మాత్తుగా 11వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఖంగు తిన్న నెమలిపేట గిరిజన రైతులు గురువారం తహశీల్దార్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.

ఏజెన్సీలో గిరిజనులకు న్యాయం చేయాలని తాసిల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా సర్వేలు చేశారు నోటిఫికేషన్లు ఇచ్చారు భూసేకరణ పరిహారం డబ్బులు కూడా వేస్తారు. అర్హులు ఎవరో.. అనర్హులు ఎవరో పట్టించుకోరా, అమాయకపు గిరిజన రైతులను అన్యాయం చేస్తారా అని తమ గోడును తహశీల్దార్ కు విన్నవించుకున్నారు.

పంటలు పండినా.. పండకపోయినా... తిన్నా తినకపోయినా తర తరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటూ ఆ భూములను నమ్ముకుని బతుకుతున్న మాకు అన్యాయం చేస్తారా...మా నోటి కాడి కూడును లాక్కుంటారా అని విలపించారు. అడ్డదారిలో పాసుపుస్తకాలు సృష్టించుకుని ఆ భూమి సరిహద్దులు ఏంటో తెలియని వారికి పరిహారం కూడా కట్టుబడతారా మాకు న్యాయం చేయండి మహాప్రభో అని తహసిల్దారును ముక్తకంఠంతో గిరిజన రైతులు వేడుకున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story