Nuzividu: నూజివీడును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం!
Nuzividu: ఏలూరు జిల్లా నూజివీడు మున్సిపల్ ఎన్నికల ముగింపు ప్రచారంలో భాగంగా మంత్రి కోలుసు పార్థసారథి నేతృత్వంలో భారీ ర్యాలీ.
Nuzividu: నూజివీడును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం!
Nuzividu: నూజివీడు మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు నేడు సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో,కూటమి శ్రేణులు పట్టణంలో అట్టహాసంగా ముగింపు ప్రచారాన్ని నిర్వహించాయి.రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కోలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై ఈ భారీ ర్యాలీని ముందుండి నడిపించారు.
టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజాతో పాటు పట్టణంలోని 36 వార్డులలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థుల విజయానికి మద్దతుగా ఈ ప్రదర్శన సాగింది.కూటమికి చెందిన ప్రముఖ నాయకులు,వేలాది మంది కార్యకర్తలు,అభిమానులు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
స్థానిక మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ భారీ ప్రదర్శన పట్టణ ముఖ్య కూడళ్ల గుండా సాగింది.రాజీవ్ సర్కిల్, బస్టాండ్,వెంకటేశ్వర స్వామి కోవెల,పెద్ద గాంధీ బొమ్మ సెంటర్,సింగ్ హోటల్ సెంటర్ మీదుగా చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ అత్యంత వైభవంగా కొనసాగింది.
దారిపొడవునా కూటమి శ్రేణుల నినాదాలు,హారతులు,పూలవర్షంతో పట్టణ పురవీధులు జనసందోహంగా మారాయి.ర్యాలీ అనంతరం చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కోలుసు పార్థసారథి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూజివీడు పట్టణ రూపురేఖలను మార్చేలా అనేక అభివృద్ధి పనులను చేపట్టామని,దీనిని ప్రజలందరూ గమనించాలని కోరారు.
పట్టణాన్ని మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు,రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి నూజివీడును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.
ఓటర్లందరూ తమ అమూల్యమైన ఓటు హక్కును ఉపయోగించుకుని,మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజాతో పాటు 36 వార్డుల కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పార్థసారథి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన నియోజకవర్గ,పట్టణ స్థాయి ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




