Nuzvid: పల్లె నుంచి పట్టణం దాకా సంక్షేమమే ధ్యేయం
Nuzvid: నూజివీడులో కూటమి ప్రభుత్వ అభివృద్ధి వాల్ పోస్టర్లు విడుదల చేసిన మంత్రి కొలుసు పార్థసారథి. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులతో ఎన్నికల సమీక్ష.
Nuzvid: పల్లె నుంచి పట్టణం దాకా సంక్షేమమే ధ్యేయం
నూజివీడు: "చెప్పాం...చేస్తున్నాం" నినాదంతో పల్లె నుండి పట్టణం వరకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.బుధవారం నూజివీడులోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ సమగ్రాభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన గోడపత్రికలు,వాల్పోస్టర్లను ఆయన లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థులతో ఎన్నికల ప్రచార వ్యూహం పై మంత్రి సమీక్ష నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని బాధ్యతాయుతంగా నెరవేరుస్తున్నామని,సంక్షేమం-అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తూ పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.నూజివీడు నియోజకవర్గంలో త్రాగునీరు,రహదారులు,డ్రైనేజీ,విద్యా, వైద్య సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని వివరించారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రతి గడపకూ చేరాలనే లక్ష్యంతోనే ఈ వాల్ పోస్టర్లను విడుదల చేశామని,వీటిని ప్రతి వార్డులోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి,మంత్రి తనయుడు కొలుసు నితిన్ కృష్ణ,కూటమి చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజా,కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




