Kukkunur: కుక్కునూరులో పింఛన్ సొమ్ము మాయంపై విచారణ వేగవంతం!

Kukkunur: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం శ్రీధర వేలేరు సచివాలయ సంక్షేమ సహాయకుడిపై పింఛన్ నిధుల మాయం ఆరోపణలతో అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 10 Sept 2026 4:35 PM IST
Kukkunur
X

Kukkunur: కుక్కునూరులో పింఛన్ సొమ్ము మాయంపై విచారణ వేగవంతం!

Kukkunur: లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్ములో లక్షల రూపాయలు అందుబాటులో లేకపోవడం కుక్కునూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీధర వేలేరు గ్రామ పంచాయతీ సచివాలయంలో పనిచేస్తున్న సంక్షేమ సహాయకుడికి సంబంధించిన ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టిన అనంతరం సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది.

వివరాల ప్రకారం.. జూలై నెలలో శ్రీధర వేలేరు పంచాయతీ పరిధిలోని పింఛన్ లబ్ధిదారులకు సచివాలయ సంక్షేమ సహాయకుడు కొంత మొత్తాన్ని పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే పంపిణీ అనంతరం మిగిలిన పింఛన్ సొమ్మును సంబంధిత ఉన్నతాధికారులకు అప్పగించాల్సి ఉండగా, ఆ మొత్తానికి సంబంధించి లెక్కలు తేలకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం సదరు ఉద్యోగి నుంచి కొంత మొత్తాన్ని రికవరీ చేసినట్లు సమాచారం. ఇంకా రికవరీ చేయాల్సిన సొమ్ము ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన మొత్తాన్ని కూడా పూర్తిగా రికవరీ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

పింఛన్ నిధుల నిర్వహణలో జరిగిన వ్యవహారంపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సదరు ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. లబ్ధిదారులకు అందాల్సిన పింఛన్ సొమ్ములో ఎంత మొత్తం గల్లంతైంది? ఇప్పటివరకు ఎంత రికవరీ చేశారు? ఇంకా ఎంత మొత్తం రికవరీ చేయాల్సి ఉంది? అనే వివరాలను అధికారులు స్పష్టంగా వెల్లడించాల్సి ఉంది.

పూర్తి రికవరీకి డిమాండ్..

పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే పింఛన్ సొమ్ము విషయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. లబ్ధిదారులకు చెందాల్సిన సొమ్మును పూర్తిగా రికవరీ చేసి, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే పింఛన్ పంపిణీ, నగదు నిల్వలు, లెక్కల నిర్వహణపై ఉన్నతాధికారులు మరింత పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR