Polavaram: పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పీపీఏ సీఈవో!

Polavaram: పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన పీపీఏ సీఈవో సంజీవ్ వోహ్రా ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ పటిష్టతపై సంతృప్తి.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం విదేశీ నిపుణుల పర్యటనకు ఏర్పాట్లు.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 3 Oct 2026 11:40 PM IST
Polavaram
X

Polavaram: పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన పీపీఏ సీఈవో!

పోలవరం, అక్టోబర్ 03: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈ సి ఆర్ ఎఫ్ ) నిర్మాణ సమయంలో ఎలాంటి ఏమరపాటుకు ఆస్కారం ఇవ్వవద్దని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ( పీ పీ ఏ సి ఈ ఓ ) సంజీవ్ వోహ్రా సూచించారు. శుక్రవారం రాత్రి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో వర్షం కురిసింది.

ఈ నేపథ్యంలో ఈ సి ఆర్ ఎఫ్ నిర్మాణప్రాంతంలో రోడ్ రోలర్ నడిపించి ఇప్పటి వరకు జరిగిన నిర్మాణం పటిష్టతను పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేశారు. డ్యామ్ నిర్మాణ ప్రాంతమైన గ్యాప్ 1, గ్యాప్ 2 లో దశల వారీగా రాయి, మట్టి, ఇసుక తో నింపుతున్నందు వల్ల నిత్యం రోడ్ రోలర్ తో ఈ ప్రాంతాన్ని గట్టి పరుస్తూ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టులోని ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈ సి ఆర్ ఎఫ్ ) నిర్మాణ ప్రాంతం గ్యాప్ 1, 2 , జి హిల్ మొదలైన వాటిని కాలి నడకన పరిశీలించారు.

జి హిల్ నుంచి ఈ సి ఆర్ ఎఫ్ నిర్మాణాన్ని అధికారులతో కలిసి వీక్షించారు. అంతకు ముందు ఆయన ప్రాజెక్ట్ కార్యాలయ సమావేశమందిరంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో పీపీఏ ఉప సంచాలకులు రవి, జలవనరుల శాఖ ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌ కె. నరసింహమూర్తి, పర్యవేక్షక ఇంజినీర్‌ పి. రామచంద్రరావు , నాణ్యతా విభాగం సి ఈ శేషుబాబు, జలవనరుల శాఖ ఈఈ డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్ట్ లో ప్రస్తుతం జరుగుతున్న పనులను జలవనరుల శాఖ అధికారులతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎం ఈ ఐ ఎల్ ‌) జనరల్‌ మేనేజర్‌ ఎ. గంగాధర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ మురళి పమ్మి, జి. శంకరయ్య తదితరులు పీపీఏ సి ఈ ఓ వోహ్రా కు వివరించారు. ప్రాజెక్ట్ నిర్మాణం అనుకున్న తేదీకి పూర్తి చేయాలని, అందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని సీఈఓ వివరించారు.

ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు, నిర్మాణ సంస్థకు ఆయన గుర్తు చేశారు. నిర్మాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కూడా ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో ప్రత్యేక శ్రద్ద కనపరుస్తున్నారని గుర్తు చేశారు. తాను ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని తరచుగా సందర్శించి పురోగతిని పరిశీలిస్తానని తెలిపారు. ఈ నెలలో విదేశీ నిపుణుల బృందం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM