Kaikaluru: చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం.. కలెక్టర్ వెట్రిసెల్వి
Kaikaluru: కైకలూరులో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన పోషణ పక్వాడ ముగింపు వేడుకలు జరిగాయి.
Kaikaluru: చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం.. కలెక్టర్ వెట్రిసెల్వి
Kaikaluru: కైకలూరు యంపిడివో కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పోషణ పక్వాడ కార్యక్రమం ముగింపు వేడుకలు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ పిల్లలు ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి పోషణ పక్వాడ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
0 -2 సంవత్సరాలు చిన్నారులకు అనునిత్యం తోడుగా ఉంటూ వారి తోలి అడుగు, గోరుముద్ద, చిరునవ్వు, మొదటి మాటలు, కంటిచూపు,వినికిడి, అవయవాలు పనితీరు ఎప్పటి కప్పుడు బేరీజు వేసుకోవాలని అన్నారు. జీవితపు మొదటి ఆరు సంవత్సరాలు లోపు పిల్లల మెదడును పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యడం మన బాధ్యత అన్నారు. 8వ పోషణ పక్వాడ ఏప్రియల్ 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు 15 రోజులు జిల్లా విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించుకున్నామని అన్నారు.
పోషకాహార లోపాన్ని తగ్గించడానికి మరియు ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొవాలని అన్నారు. తల్లి,బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటే నవ సమాజనిర్మాణానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. వ్యక్తిగత మరియు సమాజ స్థాయిలో పోషకాహార సంబంధిత ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చెయ్యడంలో అధికారులు,
సిబ్బంది శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అందుపుచ్చుకోవాలని అన్నారు. గర్భధారణ నుండి పిల్లలకి 2 సంవత్సరాలు వచ్చే వరకు అవగాహన కల్పించడం, గర్భిణీ స్త్రీలకు వైద్యసేవలు, పౌష్టికాహారం, ప్రభుత్వ ఆసుపత్రులలో జాయిన్ చేయుట, సుఖప్రసవాలకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. ఆర్గానిక్, చిరుధాన్యాలు పోషణలో ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలు భవిష్యత్తుకు మనం మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు. తల్లి,బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటే సమాజం అంతా బాగున్నట్టేనని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పోషణ పక్వాడ కార్యక్రమాలు బాగా జరిగాయని అన్నారు. మహిళలు, గర్భిణీలు, బాలల ఆరోగ్య పరిరక్షణకు మనమంతా ప్రత్యేక దృష్టిపెట్టవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు, ఇన్చార్జి ఆర్డీవో ఐ.కిశోరు, జిల్లా ఐసిడిఎస్ అధికారి పి.శారద, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకటలక్ష్మమ్మ, వివిధ శాఖలు అధికారులు, ప్రజా ప్రతినిధులు, సీడీపీవో లు, అంగన్వాడి టీచర్లు, కార్యకర్తలు, తల్లి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.




