Velairpadu: కోయిదా సచివాలయం ఖాళీ.. పింఛనుదారుల ఆందోళన!

Velairpadu: వేలేరుపాడు మండలం కోయిదా గ్రామ సచివాలయంలో సిబ్బంది గైర్హాజరుతో పింఛను దరఖాస్తుదారులు, కొండరెడ్డి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 8 Sept 2026 11:44 PM IST
Velairpadu
X

Velairpadu: కోయిదా సచివాలయం ఖాళీ.. పింఛనుదారుల ఆందోళన!

వేలేరుపాడు: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలకంగా వ్యవహరించాల్సిన గ్రామ సచివాలయం ఖాళీగా కనిపించడంతో కోయిదా గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వేలేరుపాడు మండల పరిధిలోని కోయిదా గ్రామ సచివాలయంలో మొత్తం ఆరుగురు సిబ్బంది ఉన్నప్పటికీ, మంగళవారం సచివాలయంలో ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పింఛను దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం గడువు విధించిన సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నూతన పింఛను దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని ఆన్లైన్‌లో నమోదు చేసే బాధ్యతలను సచివాలయ వ్యవస్థకు అప్పగించారు. అయితే కోయిదా సచివాలయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

ముఖ్యంగా కోయిదా పంచాయతీ పరిధిలోని టేకుపల్లి, కాకిసునూరు, పేరంటాలపల్లి గ్రామాలకు రహదారి సౌకర్యం పరిమితంగా ఉండటంతో అక్కడి కొండరెడ్డి గిరిజనులు పడవ ప్రయాణం చేస్తూ కోయిదాకు చేరుకోవాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇంత వ్యయప్రయాసలకు ఓర్చి సచివాలయానికి వచ్చిన తర్వాత సిబ్బంది అందుబాటులో లేకపోతే తిరిగి వెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ఘటనపై కూడా విమర్శలు..

గతంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిన సమయంలోనూ కోయిదా సచివాలయ సిబ్బంది విధులకు హాజరైనట్లు ముందుగానే హాజరు సంతకాలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయాన్ని గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. అప్పుడే ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుతం పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు.

సచివాలయంలో సిబ్బంది అందుబాటుపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణ సమయంలో ప్రత్యేకంగా పర్యవేక్షణ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

సిగ్నల్ సమస్యే కారణమా?..

కోయిదా ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్ సమస్య ఉండటంతో సచివాలయ సిబ్బందిని ఫోన్‌లో సంప్రదించడం కూడా కష్టంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో సిబ్బంది విధుల్లో ఉన్నారా? లేక ఇతర ప్రాంతాల్లో ఉన్నారా? అనే విషయం కూడా ప్రజలకు స్పష్టంగా తెలియడం లేదని అంటున్నారు. అయితే సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ చేసుకున్నారనే ఆరోపణలకు అధికారిక నిర్ధారణ లేదు.

ఎంపీడీఓ వివరణ..

ఈ వ్యవహారంపై కొందరు వ్యక్తులు ఎంపీడీఓ ను వివరణ కోరగా ఎంపీడీఓ, వివరణ ఇస్తూ, కోయిదా, కట్కూరు సచివాలయాల్లో మొబైల్ సిగ్నల్ సమస్య ఉండటంతో ఆ రెండు పంచాయతీలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్‌లో నమోదు చేసే డిజిటల్ అసిస్టెంట్లను ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక గదిలో ఏర్పాటు చేశామని తెలిపారు.

మిగతా సచివాలయ సిబ్బంది మాత్రం కోయిదా, కట్కూరు సచివాలయాల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. అధికారుల వివరణ ఒకవైపు ఉండగా, సచివాలయానికి వచ్చిన సమయంలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి మరోవైపు ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు కోయిదా సచివాలయ సిబ్బంది హాజరు, విధుల నిర్వహణ, పింఛను దరఖాస్తుల స్వీకరణ తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని స్థానికులు కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story