Kukunoor: స్థానిక పోరులో టీడీపీదే విజయం: పంచుమర్తి అనురాధ

Kukunoor: కుక్కునూరులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీపీ చేబ్రోలు గీతవాణితో పాటు 400 కుటుంబాలు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ సమక్షంలో టీడీపీలో చేరారు.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 18 Oct 2026 4:52 PM IST
Kukunoor
X

Kukunoor: స్థానిక పోరులో టీడీపీదే విజయం: పంచుమర్తి అనురాధ

కుక్కునూరు: రానున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచే ప్రతి అభ్యర్థి అఖండ విజయం సాధించడం ఖాయమని ఏలూరు జిల్లా టీడీపీ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం కుక్కునూరు మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆమెతో పాటు రాష్ట్ర ట్రైకార్ చైర్మన్, పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొరగం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై, ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిందని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు సైతం దొరకని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. జగన్ పాలనను ప్రజలు తిరస్కరించారని, వైసీపీ రాజకీయాలకు ప్రజలే కళ్లెం వేస్తారని వ్యాఖ్యానించారు.

ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కుక్కునూరు మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీపీ చేబ్రోలు గీతవాణితో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 400 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

మండల టీడీపీ అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు నూతనంగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ భారీ చేరికలతో కుక్కునూరు మండలంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR