Velairpadu: జాతీయ వాలీబాల్ పోటీలకు వేలేరుపాడు మల్లారం యువకులు ఎంపిక!
Velairpadu: వేలేరుపాడు మండలం మల్లారం యువకులు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు.
Velairpadu: జాతీయ వాలీబాల్ పోటీలకు వేలేరుపాడు మల్లారం యువకులు ఎంపిక!
వేలేరుపాడు: విజయవాడ ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడా పోటీల్లో వేలేరుపాడు మండలం మల్లారం గ్రామానికి చెందిన యువ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే నెల 6వ తేదీన కోయంబత్తూరులో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో మల్లారం యువ క్రీడాకారులు పాల్గొననున్నారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన గిరిజన క్రీడాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని జీలుగుమిల్లి పీహెచ్‌సీలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కూరం ప్రసాద్ పలువురు గిరిజన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అధికారులు ‘మేము సైతం’ అంటూ ముందుకు వచ్చారు.
విజయవాడలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కుర్సం విజయ్ శేఖర్, ఏలూరు జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కూరం రామరాజు, ఖమ్మం జిల్లాలో గ్రూప్-1 అధికారిగా విధులు నిర్వహిస్తున్న తాటి ప్రమోద్ సాయి, జీలుగుమిల్లి పీహెచ్‌సీలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కూరం ప్రసాద్ కలిసి రూ.15 వేల నగదు ప్రోత్సాహాన్ని క్రీడాకారులకు అందించారు.
ఈ సందర్భంగా అధికారులు క్రీడాకారులను అభినందించి, జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి మల్లారం గ్రామానికి, వేలేరుపాడు మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాల నుంచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన యువ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.




