Chintalapudi: వైసీపీ పాలకులకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు: శ్రీనివాస్ రెడ్డి!

Chintalapudi: చింతలపూడి మండలం ప్రగడవరం అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ పాలకులకు ఓటు అడిగే హక్కు లేదని ఎన్డీఏ అభ్యర్థి సౌమ్య రెడ్డి భర్త శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI
Published on: 22 Nov 2026 9:43 PM IST
Chintalapudi
X

Chintalapudi: వైసీపీ పాలకులకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు: శ్రీనివాస్ రెడ్డి!

ఏలూరు జిల్లా: చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ (NDA) కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాలూరి సౌమ్య రెడ్డి భర్త తాలూరి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రగడవరం ఓటర్ మహాశయులందరూ తాలూరి సౌమ్య రెడ్డి గారికి 'బట్టల గుత్తి' (బుట్ట గుత్తి) గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా పంచాయతీని పాలిస్తున్న వైసీపీ నాయకులకు తాను వేసే ఐదు సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం లేక వ్యక్తిగత విమర్శలకు దిగజారారని మండిపడ్డారు. ఓటమి భయం వారి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోందని, దమ్ముంటే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని ఆయన సవాల్ విసిరారు.

వైసీపీ పాలకులకు తాలూరి శ్రీనివాస్ రెడ్డి సంధించిన 5 ప్రశ్నలు:

పంచాయతీల విభజనకు ఎందుకు అడ్డుపడ్డారు?

ప్రగడవరం మేజర్ పంచాయతీ కావడం వల్ల నిధులు సరిపోక అభివృద్ధికి ఇబ్బందికరంగా ఉందని గుర్తించి ప్రగడవరం, పొనుకుమాడు, ఫాతిమాపురం గ్రామాలుగా విభజించాలని ప్రతిపాదనలు పెడితే, దానికి పంచాయతీ తీర్మానం ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

స్మశాన వాటిక బోరు కరెంట్ కనెక్షన్‌కు ఎందుకు తీర్మానం ఇవ్వలేదు?

పొనుకుమాడు గ్రామంలోని స్మశాన వాటికలో హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకులు పార్థసారథి రెడ్డి గారు దాతృత్వంతో బోరు వేయిస్తే, దానికి విద్యుత్ సర్వీస్ (కరెంట్ కనెక్షన్) కోసం గత రెండు సంవత్సరాలుగా తీర్మానం ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేశారని నిలదీశారు.

సచివాలయం తరలింపు పొనుకుమాడు ప్రజలను మోసం చేయడం కాదా?

పొనుకుమాడు గ్రామానికి మంజూరైన గ్రామ సచివాలయాన్ని మొదట ఫాతిమాపురానికి, ఆ తర్వాత వెలగలపల్లికి ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఇది పొనుకుమాడు ప్రజలను నమ్మించి మోసం చేయడం కాదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ధి నిధులకు తీర్మానాలు ఇవ్వకుండా ఎందుకు కాలయాపన చేశారు?

ఎమ్మెల్యే, ఎంపీ గ్రాంట్ల నుండి అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తే, వాటికి తీర్మానాలు ఇవ్వకుండా కాలయాపన చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ముఖ్యంగా పొనుకుమాడు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 40 లక్షల గ్రాంట్ తీసుకువస్తే, దానికి తీర్మానం ఇవ్వకుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు.

15 ఏళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించారా?

గత 15 ఏళ్ల పాలనలో ప్రగడవరం పంచాయతీలో కనీసం ఒక్క వాటర్ ట్యాంక్ గానీ, ఒక్క మీటర్ డ్రైనేజీ వ్యవస్థ గానీ నిర్మించారా అని ప్రశ్నించారు. నేటికీ శంకుచక్రపురం గ్రామ ప్రజలు మంచినీటి కోసం రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడటానికి వైసీపీ పాలకుల నిర్లక్ష్యమే కారణం కాదా అని మండిపడ్డారు.

కక్షపూరిత రాజకీయాలకు చరమగీతం పాడాలి:

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, స్థానికంగా వేరే పార్టీ పాలకులు ఉండటం వల్ల ప్రభుత్వ నిధులు తీసుకువచ్చినా కక్షపూరిత రాజకీయాలతో పంచాయతీ అభివృద్ధిని అడ్డుకున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ప్రగడవరం పంచాయతీ సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి తాలూరి సౌమ్య రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI

PINGULA ASHOK KUMAR, CHINTHALAPUDI