Eluru: నా పదవీకాలంలో రూ. 130 కోట్లతో అభివృద్ధి పనులు!
Eluru: ఏలూరు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రూ. 130 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను వెల్లడించిన చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ. హాజరైన ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్.
Eluru: నా పదవీకాలంలో రూ. 130 కోట్లతో అభివృద్ధి పనులు!
Eluru: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా తన పదవీకాలంలో 130 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ తెలిపారు.ఏలూరు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో బుధవారం జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు,డ్రైన్లు,త్రాగునీటి సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చామన్నారు.జిల్లా పరిషత్ సమావేశాలలో జెడ్పిటిసి లు తెలియజేసిన గ్రామాలలోని ప్రతీ సమస్యను పరిష్కరించేందుకు కృషిచేశామన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో సహకరించిన జెడ్పిటిసి లు,ఎంపీపీలకు ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ కృతఙ్ఞతలు తెలియజేసారు.తన పదవీకాలంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ కారుణ్య నియామకాలు అందించామని, అర్హత ఉంది ఎన్నో సంవత్సరాలుగా పదోన్నతులకు నోచుకోని వారికి పదోన్నతులు కల్పించామన్నారు.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా పరిషత్ ద్వారా పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబందించిన కాలువల ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సాగు,త్రాగునీరు అందించేందుకు గల అవకాశాలు పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు.
శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా తణుకు,తాడేపల్లిగూడెం ప్రాంతాలలో కిడ్నీ వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నారని,తణుకు డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ చేయించుకునే వారిసంఖ్య రోజురోజుకీ అనూహ్యంగా పెరుగుతున్నదన్నారు.ఈ ఆరోగ్య సమస్య కారణాలపై విశ్లేషణ చేసి,నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
జిల్లాలో ఉద్యానవన పంటలకు భీమా సౌకర్యంపై రైతులకు అవగాహన కలిగించి,భీమా ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సందర్భంగా వ్యవసాయ,ఉద్యానవనాలు,వైద్య ఆరోగ్యం, విద్యుత్,ఇరిగేషన్,గృహనిర్మాణం,తదితర శాఖల ప్రగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా పలువురు జెడ్పిటిసి లు తమకు గౌరవ వేతనాలు అందలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా జెడ్పిటిసి లను పూలదండ,దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి,మెమెంటో లను అందజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ని ఘనంగా సన్మానించారు.
ఈ సమావేశంలో ఆర్టీసీ ప్రాంతీయ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు,జిల్లా పరిషత్తు ఇంచార్జ్ సీఈఓ మల్లికార్జునరావు,డిప్యూటీ సీఈఓ భీమేశ్వర్,జడ్పీటీసి సభ్యులు,వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) మృతికి సంతాపంగా సభ రెండు నిముషాలు మౌనం పాటించింది.




