Guntur: నిరుద్యోగ రహిత గుంటూరు లక్ష్యంగా 9,200 ఉద్యోగాలు: గళ్ళా మాధవి

Guntur: నిరుద్యోగ రహిత గుంటూరు లక్ష్యంగా డిసెంబర్ నాటికి 9,200 ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 17 Sept 2026 8:25 PM IST
Guntur
X

Guntur: నిరుద్యోగ రహిత గుంటూరు లక్ష్యంగా 9,200 ఉద్యోగాలు: గళ్ళా మాధవి

Guntur: గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సియం సాయి కాంత్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ... కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో డిసెంబర్ నాటికి సుమారు 9,200 ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. డీడీయూ-జీకేవై 2.0తో పాటు మరికొన్ని పథకాల సమన్వయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.

ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ అవసరమైన నైపుణ్యాల కొరత వల్ల యువత వాటిని అందిపుచ్చుకోలేకపోతున్నారని, ఆ లోటును భర్తీ చేసేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 21 భాగస్వామ్య సంస్థల ద్వారా యువతకు శిక్షణ అందించి వివిధ రంగాల్లో ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూరుస్తూ యువత భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు.

15 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ వరకు చదివి వివిధ కారణాలతో ఉపాధి అవకాశాలు కోల్పోయిన యువతను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం అమలు చేయనున్నట్లు గళ్ళా మాధవి వివరించారు. ఉన్నత విద్య లేకపోయినా నైపుణ్య శిక్షణ ద్వారా యువతను ఉద్యోగాలకు అనుసంధానం చేస్తామని తెలిపారు. దాదాపు 10 నుంచి 15 రంగాల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంటాయని, అనేక సంస్థలు స్వయంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు.

ప్రారంభ వేతనాలు రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఉండవచ్చని, అయితే ప్రతిభ, అనుభవం ఆధారంగా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చిన్న స్థాయి ఉద్యోగాలతోనే ప్రారంభించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న విజయగాథలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు. నిరాశకు లోనుకాకుండా ఏదో ఒక ఉపాధిని ఎంచుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో ప్రతి యువకుడు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

గుంటూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పిస్తామని, శిక్షణ కేంద్రాల వివరాలు, ఉద్యోగాల స్వరూపం, వేతనాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. తన కార్యాలయం ద్వారా కూడా పూర్తి సమాచారం అందిస్తామని చెప్పారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి యువకుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిరుద్యోగ రహిత గుంటూరు, నిరుద్యోగ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN