Guntur: అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన 15 ఏళ్ల పోరాట ఫలితం: కోట మాల్యాద్రి

Guntur: గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఈనెల 8 నుంచి అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన ప్రారంభం కానుందని సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి వెల్లడించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 7 Oct 2026 3:45 PM IST
Guntur
X

Guntur: అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన 15 ఏళ్ల పోరాట ఫలితం: కోట మాల్యాద్రి

గుంటూరు: అగ్రిగోల్డ్ బాధితుల ఒరిజినల్ బాండ్లు, ధ్రువపత్రాల పరిశీలనకు ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గత 15 సంవత్సరాలుగా సాగించిన నిరంతర పోరాటాల ఫలితమేనని సీపీఐ గుంటూరు జిల్లా కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోట మాల్యాద్రి అన్నారు.

బుధవారం గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

బాధితులకు సత్వర న్యాయం అందించాలన్న డిమాండ్‌తో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆందోళనలు, పోరాటాలు నిర్వహించామని తెలిపారు.

రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. తిరుపతిరావు, రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ నాయుడు, ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖరరావు అసోసియేషన్ నాయకత్వంలో సాగించిన నిరంతర పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం ప్రస్తుతం బాండ్లు, ధ్రువపత్రాల పరిశీలనకు చర్యలు చేపట్టిందన్నారు.

ఈ నెల 8వ తేదీ నుంచి గుంటూరు ఎస్పీ కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లు, ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. బాధితులు ఒరిజినల్ బాండ్లు, ఆధార్, పాన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్, గుర్తింపు కార్డు జిరాక్స్, తాజా పాస్‌పోర్టు సైజు ఫొటోలు తదితర పత్రాలతో హాజరు కావాలని సూచించారు.

అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం కోసం సీపీఐ, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి నుంచి బాధితుల పక్షాన నిలిచి పోరాడుతున్నాయని మాల్యాద్రి తెలిపారు.

ప్రస్తుతం ప్రారంభమైన బాండ్ల పరిశీలన ప్రక్రియతో బాధితులకు న్యాయం జరిగే దిశగా మరో ముందడుగు పడిందన్నారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు అసోసియేషన్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN