Undavalli: సీడ్ యాక్సెస్ రోడ్డు భూసేకరణను అడ్డుకున్న రైతులు!
Undavalli: అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణలో భాగంగా ఉండవల్లిలో భూసేకరణ. జేసీబీలను అడ్డుకున్న రైతులు, మహిళలు. ప్లాట్లు కేటాయించామన్న సీఆర్‌డీఏ అధికారులు.
Undavalli: సీడ్ యాక్సెస్ రోడ్డు భూసేకరణను అడ్డుకున్న రైతులు!
Undavalli: రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ పనుల కోసం ఉండవల్లి గ్రామంలో రెండు ఎకరాల 73 సెంట్ల భూమిని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డిఏ అధికారులు శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఉండవల్లి సీఆర్‌డీఏ యూనిట్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ.జీ. చిన్ని కృష్ణ పర్యవేక్షణలో, భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ భూసేకరణ ప్రక్రియ జరిగింది.
ఈ సందర్భంగా పొలాల్లోకి జేసీబీలతో ప్రవేశించిన సిబ్బంది పంటలను తొలగించేందుకు ప్రయత్నించగా, స్థానిక రైతులు, మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. తాము ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న మూడు పంటలు పండే బహువార్షిక జరీబు భూములను బలవంతంగా లాక్కోవద్దని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, ఆ ప్రాంతంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు మార్కెట్ ధర ప్రకారం అధిక పరిహారం అందించాలని, గ్రీన్ జోన్ పరిమితులను తొలగించాలని ఇక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడ నగరాన్ని, జాతీయ రహదారి-16 ను అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాతో అనుసంధానించేందుకు ఈ 21 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న సీడ్ క్యాపిటల్ రోడ్డు ఎంతో కీలకమని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం వెంకటపాలెం నుండి ఉండవల్లి మధ్య 3.92 కి.మీ మేర ఫేజ్-2 పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇందులో భాగంగానే ఈ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
భూసమీకరణ విధానం ద్వారా భూములు ఇచ్చిన రైతులకు రాయపూడిలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే పారదర్శకమైన ఈ-లాటరీ పద్ధతి ద్వారా నివాస, వాణిజ్య తిరుగు ప్లాట్లను కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు.




