Vinukonda: యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్ల ప్రొబేషన్ ప్రకటించాలి

Vinukonda: అర్హతలు పూర్తయినా ప్రొబేషన్ ప్రకటించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న 1,896 మంది ఏహెచ్‌ఏ ఉద్యోగులు. వెంటనే క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి.

KAREEMULLA, VINUKONDA
Published on: 18 Sept 2026 5:06 PM IST
Vinukonda
X

Vinukonda: యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్ల ప్రొబేషన్ ప్రకటించాలి

వినుకొండ: 2023 నోటిఫికేషన్ ద్వారా ఎంపికై విధుల్లో చేరిన 1,896 మంది యానిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్ల (AHA) ప్రొబేషన్‌ను వెంటనే ప్రకటించి, క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. తాము 2024 మార్చి 1 నాటికి గ్రామ సచివాలయాల పరిధిలో విధుల్లో చేరామని తెలిపారు.

ప్రభుత్వం నిర్దేశించిన శాఖాపరమైన పరీక్షలు, ఇతర అవసరమైన తనిఖీలను 2026 ఫిబ్రవరి నాటికే పూర్తి చేసుకున్నామని పేర్కొన్నారు. అర్హతలు పూర్తయినా గత ఏడు నెలలుగా ప్రొబేషన్‌ ప్రకటించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నెలకు రూ.15 వేల కన్సాలిడేటెడ్‌ పే మాత్రమే అందుతుండటంతో పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. ముఖ్యంగా సొంత జిల్లాలకు దూరంగా పనిచేస్తున్న 60 మందికి పైగా నాన్‌-లోకల్‌ ఉద్యోగులు అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

తల్లిదండ్రులు, పిల్లల వైద్య ఖర్చులు, పిల్లల చదువుల ఫీజులు, పుస్తకాల ఖర్చులు భరించడం భారంగా మారిందన్నారు. తమ సమస్యలను ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లాకు, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ పి. రామారావుకు వినతిపత్రాల ద్వారా తెలియజేశామని తెలిపారు.ప్రభుత్వం స్పందించి అర్హతలు పూర్తి చేసిన 1,896 మంది AHAలకు వెంటనే ప్రొబేషన్‌ ప్రకటించి, క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA