Guntur: కేసుల పరిష్కారంలో ఏపీ RTI కమిషన్‌కు జాతీయ గుర్తింపు
Guntur: కేసుల పరిష్కారంలో ఏపీ ఆర్టీఐ కమిషన్ జాతీయ గుర్తింపు పొందిందని, 9 నెలల్లో 7,034 కేసులు పరిష్కరించామని చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు తెలిపారు.
Guntur: కేసుల పరిష్కారంలో ఏపీ RTI కమిషన్‌కు జాతీయ గుర్తింపు
గుంటూరు: కేసుల పరిష్కారంలో రాష్ట్ర ఆర్.టి.ఐ కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు తెలిపారు. సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో సోమవారం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంను ప్రజలకు మరింత చేరువ చేయుటకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో శక్తివంతమైన ఆయుధం అన్నారు. దేశంలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి పనితీరును కూడా పొందే అవకాశం కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్ర సమాచార కమిషన్ మంచి పనితీరును కనబరుస్తుందని పేర్కొన్నారు.
2026 జనవరి నుంచి సెప్టెంబర్ నెలాఖరు నాటికి 7,034 కేసులు పరిష్కరించి చరిత్ర సృష్టించిందన్నారు. ప్రస్తుత కమిషనర్లు 10 వేల కేసులు పరిష్కరించారని ప్రశంసించారు. 2024 సంవత్సరంలో 3,252 కేసులు, 2025 లో 3,326 కేసులు మాత్రమే పరిష్కరించడం జరిగిందని చెప్పారు. 2024లో 6,635 కేసులు, 2025లో 6,423 కేసులు, 2026 సెప్టెంబర్ నాటికి 4,894 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
ఈ ఏడాది చివరి నాటికి 8 వేల పైచిలుకు కేసులు నమోదు కావడం జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. కేసులను వేగవంతంగా పరిష్కరించుటకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా 2013 నుండి 2023 వరకు గల అన్ని కేసులు వచ్చే నెలాఖరు నాటికి పరిష్కరించి మిగిలిన కేసుల పరిష్కారానికి సన్నద్ధం అవుతున్నట్లు చెప్పారు. అవసరాన్ని అనుసరించి ఇద్దరు సభ్యులతో కూడిన బెంచ్ లు, ముగ్గురు సభ్యులతో కూడిన ఫుల్ బెంచ్ లు ఏర్పాటు చేసి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
మొదట వచ్చిన కేసు మొదటగా పరిష్కారం కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడే అందిన దరఖాస్తులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ నుండి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామని అన్నారు. గ్రామ స్థాయి నుంచి ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టి దూరప్రాంతాల నుండి వచ్చే వారికి వ్యయ ప్రయాసలు లేకుండా చేస్తున్నామని అన్నారు. ఆన్ లైన్ విచారణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
95 శాతం విచారణలు ఆన్ లైన్ లో జరుగుతున్నాయని, దగ్గర ప్రాంతాల్లో ఉండే వారు 5 శాతం వరకు నేరుగా వస్తున్నారని తెలిపారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా నుండి 65 సంవత్సరాల వృద్ధురాలు ఆన్ లైన్ లో విచారణకు హాజరు అయ్యారని చెప్పారు. ఆన్ లైన్ విచారణలకు సుప్రీం కోర్టు సైతం ప్రశంసించిందని వివరించారు. అన్ని రాష్ట్రాలకు దీనిని అనుసరించాలని సూచించిందని చెప్పారు.
ఆన్ లైన్ విచారణలను అధ్యయనం చేయుటకు గత నెల 27న తమిళనాడు ఆర్.టి.ఐ కమిషన్ ప్రతినిధులు వచ్చారని తెలిపారు. ఆర్.టి.ఐ పనితీరు మెరుగు పరచడానికి వివిధ కార్యాలయాలను సైతం తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించి చర్యలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో 263 కార్యాలయాలను తనిఖీ చేసి, 162 కార్యాలయాల్లో లోపాలు గుర్తించి సమాచార అధికారులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని వివరించారు. పి.ఐ.ఓలు, ఏ.పి.ఐ.ఓలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
శిక్షణ కార్యక్రమాలను ప్రతి నెల నిర్వహిస్తూ నిరంతర ప్రక్రియ చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లాలో ఆర్.టి.ఐ నోడల్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారని, అయితే ప్రత్యేకంగా ఇద్దరు అధికారులను నియమించాలని ప్రతిపాదించామని చెప్పారు. ఆర్.టి.ఐ చట్టాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్న 9 మందిని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగిందని తెలిపారు.
అటువంటి వ్యక్తులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. స్వార్ధపరులకు అవకాశం లేకుండా చేస్తామని అన్నారు. పౌరుని ప్రాథమిక హక్కులను సాధించుకునే గొప్ప చట్టం అని పేర్కొన్నారు. ప్రతీ కార్యాలయం 4(1)(బి) అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానం పెంచాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం కమిషనర్లు చావలి.సునీల్, డా.రెహానా బేగం, గాజుల అదెన్న, డా.అల్లారెడ్డి ఉదయ భాస్కర రెడ్డి, శరత్ చంద్ర కల్యాణ్ చక్రవర్తి వట్టికూటి, వంటేరు రవి బాబు, పి.ఎన్. నాయుడు, కమిషన్ కార్యదర్శి సి.హెచ్.పద్మావతి దేవి, ఉప కార్యదర్శి కె.నరసింహా రావు, లా సెక్రటరీ వి.రఘురామ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.




