Bapatla: గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ వినోద్ కుమార్!
Bapatla: బాపట్లను గంజాయి, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు.
Bapatla: గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ వినోద్ కుమార్!
బాపట్ల: మాదకద్రవ్యాల నిర్మూలనకు శాఖల మధ్య సమన్వయంగా పని చేయాలి, బాపట్ల జిల్లాను గంజాయి, మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో మాదకద్రవ్యాల ప్రభావం లేకుండా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖలపై ఉందన్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని సూచించారు.పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 1972కు ఫోన్ చేసి తెలియజేయాలని ప్రజలకు సూచించారు.మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్య, రవాణా తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు.
నిరంతర తనిఖీలతో పాటు అవగాహన సదస్సులను మరింత పెంచాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో అదనపు ఎస్పీ సుధాకర్, చీరాల, బాపట్ల, రేపల్లె డీఎస్పీలు మొయిద్దీన్, చంద్రమౌళి, అజీజ్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాససింగ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పద్మావతి, జిల్లా రవాణాశాఖ అధికారి పరంధామరెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.




