Bapatla: బాపట్లలో పోలీసుల మెగా ఆపరేషన్.. అర్ధరాత్రి కార్డెన్ సెర్చ్!

Bapatla: బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో 100 మంది పోలీసులతో భారీ కార్డెన్ సెర్చ్. జిల్లాను గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యమన్న డీఎస్పీ శ్రీనివాసరావు.

KIRAN BABU,	VEMURU
Published on: 31 May 2026 9:58 AM IST
Bapatla
X

Bapatla: బాపట్లలో పోలీసుల మెగా ఆపరేషన్.. అర్ధరాత్రి కార్డెన్ సెర్చ్!

Bapatla: బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో పోలీసులు నిర్వహించిన భారీ కార్డెన్ సర్చ్ మరోసారి జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనపై పోలీస్ శాఖ ఎంత కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందో స్పష్టం చేసింది. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక తనిఖీల్లో గ్రామంలోని పలు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనాల ధ్రువపత్రాలు, అనుమతులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డీఎస్పీ శ్రీనివాసరావు, రేపల్లె డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 11 ప్రాంతాల్లో కార్డెన్ సర్చ్ విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొంటూ, డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయం, రవాణా లేదా వినియోగంలో ఎవరైనా పాల్గొన్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటోందని, అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి కనికరం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించిన పోలీసులు, ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలతో పాటు ఆకస్మిక తనిఖీలు కూడా కొనసాగనున్నాయని తెలిపారు. బాపట్ల జిల్లాను పూర్తిగా గంజాయి రహిత జిల్లాగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ, ప్రజలు పోలీసులకు సహకరించి సమాజాన్ని మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలని కోరారు. ఈ కార్డెన్ సర్చ్ కార్యక్రమంలో 100 పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

KIRAN BABU,	VEMURU

KIRAN BABU, VEMURU

Next Story