Repalle: రేపల్లె నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం!
Repalle: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉన్న 86 సర్పంచ్ స్థానాలకు మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది.
Repalle: రేపల్లె నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం!
రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. నేటి నుంచి నాలుగు మండలాల్లో నామినేషన్ల స్వీకరణ, రేపల్లె, నగరం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల్లో 86 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నామినేషన్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు, డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా చర్యలు స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల నేపథ్యంలో బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది.
నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో నేటి నుంచి సర్పంచ్ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపల్లె నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో మొత్తం 86 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రేపల్లె మండలంలో 28, నగరం మండలంలో 27, చెరుకుపల్లి మండలంలో 16, నిజాంపట్నం మండలంలో 15 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి.
నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని మండలాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన సౌకర్యాలు కల్పించారు. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు రేపల్లె డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో అన్ని నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
మండలాల వారీగా ఓటర్ల వివరాలు:
రేపల్లె రూరల్ మండల పరిధిలో మొత్తం 48,848 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 24,239, మహిళలు 24,608, ఇతరులు ఒకరు ఉన్నారు. నగరం మండలంలో మొత్తం 42,477 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 20,757, మహిళలు 21,716, ఇతరులు నలుగురు ఉన్నారు.
చెరుకుపల్లి మండలంలో మొత్తం 49,164 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 23,830, మహిళలు 25,329, ఇతరులు ఐదుగురు ఉన్నారు. నిజాంపట్నం మండలంలో మొత్తం 50,397 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 25,193, మహిళలు 25,204 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు లేరు.
నాలుగు మండలాల్లో కలిపి మొత్తం 1,90,886 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తంగా రేపల్లె నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలుకావడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది. నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది.




