Repalle: రేపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన!
Repalle: బాపట్ల జిల్లా రేపల్లెలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు.
Repalle: రేపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన!
Repalle: రేపల్లె పట్టణం 4 వార్డు నందు పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రజావేదిక సమావేశం, వివిధ శాఖల స్టాళ్లను సందర్శించనున్నారు. అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్.
ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామంలోని తన నివాసం వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు రేపల్లె మున్సిపాలిటీ హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతారు.
ఉదయం 11.15 గంటలకు రేపల్లె మున్సిపాలిటీ 4వ వార్డులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉదయం 11.25 నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు లబ్ధిదారులతో ముఖ్యమంత్రి మాట్లాడి వారి అభిప్రాయాలు, సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను ముఖ్యమంత్రి తెలుసుకుంటారు.
అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు రేపల్లె మున్సిపాలిటీ పరిధిలోని ప్రజావేదిక వేదికకు చేరుకుని ప్రజావేదిక సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను సందర్శిస్తారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2.10 గంటల వరకు కొనసాగుతుంది.
తదుపరి మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రజావేదిక నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.25 గంటలకు రేపల్లె మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన పార్టీ క్యాడర్ సమావేశ వేదికకు చేరుకుంటారు. 3.25 నుంచి సాయంత్రం 4.55 గంటల వరకు పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం సాయంత్రం 4.55 గంటలకు రేపల్లె మున్సిపల్ హైస్కూల్ హెలిప్యాడ్ నుండి బయలుదేరి, 5.20 గంటలకు హెలికాప్టర్లో తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని తన నివాసానికి తిరుగు ప్రయాణం అవుతారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపడుతోంది. భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, వేదికలు, తాగునీరు, వైద్య, విద్యుత్ తదితర ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో పూర్తి చేయునున్నారని కలెక్టర్ తెలిపారు.




