Vinukonda: నలబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు!
Vinukonda: పల్నాడు జిల్లా కొండ్రుముట్ల గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడు నలబోతు గోవిందరాజు కాంస్య విగ్రహావిష్కరణ.
Vinukonda: నలబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు!
Vinukonda: స్వాతంత్ర్య సమరయోధుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే నలబోతు గోవిందరాజు జీవితం దేశభక్తి, ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.
ఈపూరు మండలం కొండ్రుముట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి జీవీ ఆవిష్కరించారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్‌లో మేజర్‌గా పనిచేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప దేశభక్తుడు గోవిందరాజు అని జీవీ కొనియాడారు.
స్వాతంత్ర్యం అనంతరం ప్రజాజీవితంలోకి వచ్చి వినుకొండ ప్రాంత ప్రజలకు సేవలందించారని తెలిపారు. కమ్యూనిస్టుల ప్రభావం బలంగా ఉన్న సమయంలోనూ ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఎమ్మెల్యేగా గెలుపొందారని గుర్తుచేశారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి పాఠశాలలు, హైస్కూళ్ల ఏర్పాటుకు కృషి చేశారని పేర్కొన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన గోవిందరాజుకు గ్రామీణ ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉండేదన్నారు.
గోవిందరాజు ఆశయాలను భావితరాలకు అందించడమే ఆయనకు నిజమైన నివాళి అని జీవీ అన్నారు. విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, జూలకంటి బ్రహ్మారెడ్డి, GDCC బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.




