Bapatla: బండపాలెంలో పోలీసుల కార్డన్ సెర్చ్ 29 వాహనాలు సీజ్
Bapatla: చీరాల బండపాలెంలో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. సరైన పత్రాలు లేని 29 వాహనాలు సీజ్, గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఐ సోమశేఖర్ వెల్లడి.
Bapatla: బండపాలెంలో పోలీసుల కార్డన్ సెర్చ్ 29 వాహనాలు సీజ్
Bapatla: యువత భవిష్యత్తును చిదిమేస్తున్న గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని, గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించి గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని చీరాల 1టౌన్ సిఐ జి సోమశేఖర్ తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు చీరాల పట్టణంలో వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా బండపాలెం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. భారీగా అనుమానిత వాహనాలను పోలీస్ అధికారులు సీజ్ చేశారు. గంజాయి వలన కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ ఎం.డి. మొయిన్ గారి ఆధ్వర్యంలో చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండపాలెం ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చీరాల వన్ టౌన్ సీఐ జి సోమశేఖర్, టూ టౌన్ సీఐ ఎస్ శశికుమార్ తో పాటు ఎస్‌ఐలు రాజ్యలక్ష్మి, వాణిశ్రీ, పవన్ కుమార్, రూరల్ ఎస్ఐ రామాంజనేయులు సిబ్బంది సహా మొత్తం 30 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సోదాల్లో భాగంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు సహా మొత్తం 29 వాహనాలను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించే ఉద్దేశంతో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాను పూర్తిస్థాయిలో గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి లక్ష్య సాధన వైపు అడుగులు వేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి, యువత నుంచి పూర్తి సహకారం అందినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు.
జిల్లాలో ఎక్కడైనా గంజాయి క్రయవిక్రయాలు జరిగినా లేదా చట్టవ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు జరిగినా వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 112కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.




