Guntur: జనగణన-2027ను సమర్థవంతంగా పూర్తి చేయాలి: మయూర్ అశోక్!

Guntur: గుంటూరు కలెక్టరేట్ మినీ శంకరన్ హాల్‌లో గురువారం జనగణన-2027 ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణలో కమిషనర్ కె. మయూర్ అశోక్ పాల్గొని షెడ్యూల్‌పై ఆదేశాలిచ్చారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 19 Nov 2026 6:50 PM IST
Guntur
X

Guntur: జనగణన-2027ను సమర్థవంతంగా పూర్తి చేయాలి: మయూర్ అశోక్!

గుంటూరు: జనగణన-2027లో భాగంగా రెండో దశలో నిర్వహించనున్న జనాభా గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియను గుంటూరు నగరంలో పకడ్బందీగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని మిని శంకరన్ హాల్లో ఫీల్డ్ ట్రైనర్లకు నిర్వహించే శిక్షణ తరగతుల్లో కమిషనర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జనవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) ప్రక్రియకు అవకాశం ఉంటుందని, జనవరి 25వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఇంటింటి జనాభా గణన నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మార్చి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పునఃపరిశీలన ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ఫీల్డ్ ట్రైనర్లు, తదుపరి సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు డిసెంబర్ రెండో వారంలో శిక్షణ అందించవలసి ఉంటుందన్నారు. జనగణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో శిక్షణ పొందాలని సూచించారు. జనగణన దేశ అభివృద్ధికి అవసరమైన కీలకమైన సమాచార సేకరణ ప్రక్రియ కావడంతో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఐ.కిషోర్, డిప్యూటీ కమిషనర్లు జి.సాంబశివరావు, బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్ పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN