Guntur: గుంటూరులో ముగ్గురు కమ్యూనిస్టు యోధుల సంస్మరణ సభ.. సిపిఐ పిలుపు!

Guntur: గుంటూరులో కమ్యూనిస్టు నేతలు ఆలా నాగేశ్వరరావు, పి.ఆర్. ప్రకాశ్‌రావు, ఏటుకూరి ప్రసాద్‌ల సంస్మరణ సభను ఆగస్టు 26న నిర్వహించనున్నట్లు సీపీఐ నేతలు వెల్లడించారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 25 Aug 2026 4:29 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో ముగ్గురు కమ్యూనిస్టు యోధుల సంస్మరణ సభ.. సిపిఐ పిలుపు!

Guntur: సీపీఐ రైతు, కార్మిక ఉద్యమ నేత ఆలా నాగేశ్వరరావు, శాంతి, స్నేహ సంఘం నాయకులు పి.ఆర్. ప్రకాశ్‌రావు, అరసం నేత, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పూర్వ సంపాదకులు ఏటుకూరి ప్రసాద్‌ల సంస్మరణ సభను ఆగస్టు 26న సాయంత్రం 5 గంటలకు గుంటూరులోని కొత్తపేట మల్లయ్య లింగం భవన్‌లో నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు.

మంగళవారం మల్లయ్య లింగం భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత కమ్యూనిస్టు పార్టీ కోసం, పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తూ అనేక ప్రజా పోరాటాలు నిర్వహించిన ఈ ముగ్గురు నేతలను స్మరించుకోవడం గర్వకారణమన్నారు. వారి సేవలను స్మరించుకునే భాగంగా సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సభకు మేధావులు, అభ్యుదయ రచయితలు, కార్మిక, కర్షక నేతలు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోట మాల్యాద్రి పిలుపునిచ్చారు.సిపిఐ మహా ఉద్యమంలో భాగంగా ఢిల్లీ బహిరంగ సభకు గుంటూరు నుంచి భారీగా తరలివెళ్తాం.

సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకీటి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. “మార్పు కావాలి.. మార్పు రావాలి” అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ప్రారంభించిన మహా ఉద్యమంలో భాగంగా గుంటూరు నగరంలో ప్రజలను చైతన్యపరుస్తూ పాదయాత్ర నిర్వహించామని తెలిపారు. అనంతరం ఈ నెల 17వ తేదీన పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించామని చెప్పారు.

సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు గుంటూరు నగరం నుంచి సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ నిర్వహిస్తున్న ప్రజా పోరాటంలో గుంటూరు నగర సమితి నుంచి పెద్ద ఎత్తున పాల్గొంటామని అన్నారు.

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న ఏసీబీ విచారణపై ఆయన స్పందిస్తూ.. గతంలో జరిగిన అవకతవకలు, అభివృద్ధి పనుల పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, విచారణ న్యాయబద్ధంగా నిర్వహించి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని సిపిఐ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ ఎన్నికల బరిలోకి దిగుతుందని ఆకీటి అరుణ్‌కుమార్ తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఐకి చట్టసభల్లో కూడా ప్రజల గొంతుక వినిపించే అవకాశం కల్పించాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు, జిల్లా సమితి సభ్యులు జంగాల చైతన్య, బి.వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story