Vinukonda: దాహార్తికి శాశ్వత పరిష్కారం రూ.239.06 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభం
Vinukonda: వినుకొండ రూ.239.06 కోట్లతో మహా జలధార తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జీవీ ఆంజనేయులు.
Vinukonda: దాహార్తికి శాశ్వత పరిష్కారం రూ.239.06 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభం
Vinukonda: వినుకొండ పట్టణ ప్రజల దశాబ్దాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పట్టణ ప్రజలకు నిరంతరం సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందించేందుకు రూ.239.06 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సమగ్ర తాగునీటి పథకానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదివారం వినుకొండలోని ఎన్‌ఎస్‌పీ గ్రౌండ్‌లో శంకుస్థాపన చేశారు
ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, వినుకొండ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం అత్యంత ముఖ్యమైనదని తెలిపారు. “మాట ఇచ్చాం... నిధులు సాధించాం... ఇప్పుడు ప్రజల కళ్ల ముందే కార్యరూపంలోకి తీసుకొస్తున్నాం” అని పేర్కొన్నారు.
అమృత్, UIDF నిధులతో ఈ భారీ ప్రాజెక్టును చేపడుతున్నామని తెలిపారు.ప్రాజెక్టు సాధనకు సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు వినుకొండ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఎన్‌ఎస్‌పీ మెయిన్ కెనాల్ నుంచి దొండపాడు చెరువు మీదుగా అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా నీటిని వినుకొండకు తీసుకొచ్చేలా ప్రాజెక్టును రూపొందించినట్లు జీవీ వివరించారు. మూడు చెరువులను సమీకరించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఒక్కసారి పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తే సుమారు ఆరు నెలలపాటు పట్టణ అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ప్రతి వ్యక్తికి రోజు సురక్షితమైన తాగునీరు అందించడం, పట్టణంలోని చివరి కుటుంబం వరకు కుళాయి ద్వారా నీరు చేరేలా చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని స్పష్టం చేశారు.




