Cheerala: చీరాలలో ఘనంగా ఇంజనీర్స్ డే ఘన నివాళులర్పించిన వాకర్స్ అసోసియేషన్!
Cheerala: బాపట్ల జిల్లా చీరాలలో ఎన్.ఆర్.&పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, ఇంజనీర్స్ డే వేడుకలు.
Cheerala: చీరాలలో ఘనంగా ఇంజనీర్స్ డే ఘన నివాళులర్పించిన వాకర్స్ అసోసియేషన్!
Cheerala: దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని, భారతదేశ అభివృద్ధికి ఇంజనీర్‌గా, పరిపాలకుడిగా, దార్శనికుడిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా చీరాల ఎన్.ఆర్.& పి.ఎం. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైస్కూల్ గ్రౌండ్‌లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముఖ్య ఆహ్వానితులైన పెరుగు శ్రీనివాసరావు, వలివేటి మురళీకృష్ణ, ఏ. రామగోవిందరెడ్డి, ఎస్.ఎన్. కృష్ణకాంత్, మువ్వల సాంబశివరావు, ఎస్.వి. స్వామి, సింగయ్య, వడలి రాధాకృష్ణలను వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూణేలో సివిల్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి, అనంతరం పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్‌లో ఇంజనీర్‌గా సేవలు ప్రారంభించారని తెలిపారు. ఖడక్‌వాస్లా జలాశయంలో ఆటోమేటిక్ వాటర్ ఫ్లడ్ గేట్లను రూపొందించి పేటెంట్ పొందిన ప్రతిభావంతుడని కొనియాడారు.
కావేరి నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ద్వారా విస్తారమైన భూములకు సాగునీరు అందేలా చేసి వ్యవసాయాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఇంజనీరింగ్ రంగంలో వినూత్న ఆలోచనలతో అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారాలను చూపిన మహనీయుడని పేర్కొన్నారు.
నిజాం నవాబు ఆహ్వానం మేరకు హైదరాబాద్‌లో మూసీ నది వరదల సమస్యను అధ్యయనం చేసి, నగరాన్ని వరదల నుంచి రక్షించే విధానాలను రూపొందించారని వక్తలు వివరించారు. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుంచి రక్షించేందుకు వ్యవస్థను రూపొందించడమే కాకుండా, తిరుమల ఘాట్ రోడ్డు రూపకల్పనలోనూ విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
మైసూరు సంస్థానానికి దివాన్‌గా సుమారు ఏడు సంవత్సరాల పాటు పనిచేసిన విశ్వేశ్వరయ్య రాష్ట్రాన్ని పారిశ్రామిక, విద్యా రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. భద్రావతి ఉక్కు కర్మాగారం, మైసూరు శాండిల్ సబ్బుల ఫ్యాక్టరీ, మైసూరు విశ్వవిద్యాలయం వంటి అనేక సంస్థల అభివృద్ధికి ఆయన కృషి చేశారని తెలిపారు. దేశ పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాదులు వేసిన అపర భగీరథుడిగా విశ్వేశ్వరయ్యను అభివర్ణించారు.
ఆయన ప్రతిభను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం ‘నైట్ హుడ్’ బిరుదుతో సత్కరించిందని, భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’తో గౌరవించిందని వక్తలు తెలిపారు. విశ్వేశ్వరయ్య జీవితం నేటి యువ ఇంజనీర్లకు, విద్యార్థులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ల గురుప్రసాద్, గెల్లి తుకారాం, శ్రీనివాసరావు, నారాయణమూర్తి, మధు, భాస్కర్, సాంబశివరావు, లాల్, ప్రసాద్ తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.




