Guntur: డిసెంబర్ 22న ఎస్.ఐ.ఆర్ తుది ఓటరు జాబితా ప్రకటన: జేసీ అశుతోష్!

Guntur: డిసెంబర్ 22న ఎస్.ఐ.ఆర్ తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నమోదుకు డిసెంబర్ 23 నుంచి అవకాశం ఉంటుందని డీఆర్ఓ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 18 Nov 2026 7:49 PM IST
Guntur
X

Guntur: డిసెంబర్ 22న ఎస్.ఐ.ఆర్ తుది ఓటరు జాబితా ప్రకటన: జేసీ అశుతోష్!

గుంటూరు: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్.ఐ.ఆర్)లో భాగంగా తుది జాబితాను డిసెంబరు 22న విడుదల చేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎన్నికలపై సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారం ఇంకా అందించని ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్, డిసీజ్డ్ (ఏ,ఎస్,డి,డి) జాబితాలో ఉన్న 2.37 లక్షల మంది మాత్రం నవంబరు 30వ తేదీ లోపు సమర్పించవచ్చని చెప్పారు. కొత్త వారి నుండి తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు. డిసెంబరు 10వ తేదీ లోగా విచారణలు పూర్తి చేసి అర్హులను జాబితాలో చేర్చడం జరుగుతుందని చెప్పారు.

ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఓటరుకు డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం

ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఎన్నికలకు సంబంధించి ఓటరుగా నమోదు కావడానికి డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం ఉంటుందని గుంటూరు - కృష్ణా ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఇ.ఆర్.ఓ మరియు జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు.

పూర్వ గుంటూరు, కృష్ణా జిల్లాలలో పనిచేస్తున్న ఉన్నత పాఠశాల మరియు ఆపై స్థాయిలో బోధనలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటరుగా నమోదు కావడానికి అర్హులన్నారు. భారత ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్థానిక నివాసం ఉన్నప్పుడు మాత్రమే ఓటరుగా అర్హులుగా పరిగణింపడం జరుగుతుందని స్పష్టం చేశారు.

2026 నవంబరు 1వ తేదీకి ముందు ఆరు సంవత్సరాల నుండి వృత్తిలో కొనసాగాలని అందులో కనీసం మూడు సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల, ఆపై స్థాయిలో బోధన అనుభవం ఉండాలని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు అర్హత కలిగి ఉంటారని, వారికి జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐఓ), కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ నిర్ధారణ చేయాలని వివరించారు.

ఓటరుగా ఆన్లైన్ ద్వారా నమోదు కావచ్చని లేదా ఫారం 19 పూర్తి చేసి ఏ.ఈ.ఆర్.వోలు ఉన్న స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లకు సమర్పించవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు 15 వేల దరఖాస్తులు అందాయని, మొత్తం 19 వేల వరకు పనిచేస్తున్నట్లు అంచనా ఉందని చెప్పారు.

ఈ సమావేశంలో కాంగ్రెసు పార్టీ ప్రతినిధి కె.కె.గుప్తా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కంచర్ల శివరామయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డా.టి.సేవ కుమార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి చిరతన గండ్ల వాసు, సి.పి.ఐ (ఎం) ప్రతినిధి కృష్ణకాంత్, వైఎస్ఆర్సిపి ప్రతినిధి వై పిచ్చి రెడ్డి, జన సేన పార్టీ ప్రతినిధి త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN