Guntur: బాపూజీ చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శం: గళ్ళా మాధవి

Guntur: గాంధీజీ చూపిన సత్యం, అహింస, స్వచ్ఛత మార్గం నేటి యువతకు ఆదర్శమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కొరిటెపాడు సెంటర్‌లో నివాళులర్పించి పేర్కొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 2 Oct 2026 6:49 PM IST
Guntur
X

Guntur: బాపూజీ చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శం: గళ్ళా మాధవి

Guntur: గాంధీజీ చూపిన సత్యం, అహింస, స్వచ్ఛత మార్గం నేటి యువతకు ఆదర్శమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. శనివారం గుంటూరు కొరిటిపాడు సెంటర్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి గురువారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, వల్లూరి జయ ప్రకాష్ నారాయణ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ, మహాత్మా గాంధీని కేవలం స్వాతంత్య్ర సమరయోధుడిగా మాత్రమే కాకుండా, తన జీవితాన్ని విలువలతో నింపుకున్న మహనీయుడిగా గుర్తు చేసుకోవాలని అన్నారు. గాంధీజీ జీవితం ఒక తెరిచిన పుస్తకమని, అందులోని సత్యం, అహింస, స్వచ్ఛత, క్రమశిక్షణ వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.

అపారమైన ధైర్యసాహసాలు కలిగి ఉన్నప్పటికీ ఎక్కడా అహంకారానికి, ఆవేశానికి తావివ్వకుండా తన లక్ష్యాలను సాధించిన మహానేత గాంధీజీ అని పేర్కొన్నారు. అహింసా మార్గంలో నడుస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. చిన్న చిన్న విషయాలకే ఆవేశపూరితంగా స్పందించే ఈ కాలంలో గాంధీజీ ఆలోచనలు యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

సత్యమే జీవితానికి పునాది అని గాంధీజీ తన జీవితాంతం నిరూపించారని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాయితీని విడిచిపెట్టకుండా జీవించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. తన ఆత్మకథ “My Experiments with Truth” ద్వారా కూడా సత్యాన్వేషణ కోసం చేసిన ప్రయాణాన్ని ప్రపంచానికి తెలియజేశారని పేర్కొన్నారు.

స్వచ్ఛతకు గాంధీజీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి, అభివృద్ధికి పునాదిగా నిలుస్తాయని ఆయన విశ్వసించారని చెప్పారు. అదే స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

అదే విధంగా మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి దేశభక్తి, నిరాడంబరత, నిజాయితీకి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. గాంధీజీ, శాస్త్రిజీ వంటి మహనీయుల ఆలోచనలు, విలువలు, నైతికతలు భావితరాలకు ఆదర్శమని, ప్రజా జీవితంలో ఉన్న ప్రతి నాయకుడు వారి స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు.

నేటి తరం ప్రజాప్రతినిధులు, యువ నాయకులు మహనీయుల ఆశయాలను ఆచరిస్తూ ముందుకు వెళితే దేశం, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రావు, కూటమి నాయకులు, స్థానిక నాయకులు భద్రయ్య, మాజీ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN