Guntur: జీటీఎస్ పనులు వేగవంతం చేయాలి: జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్
Guntur: గుంటూరు నగరంలో గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల పనులను గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను జీఎంసీ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు.
Guntur: జీటీఎస్ పనులు వేగవంతం చేయాలి: జీఎంసీ కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు: గుంటూరు నగరంలో పారిశుధ్య నిర్వహణను ఆధునీకరించి మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన గార్బెజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల (జిటిఎస్) నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గోరంట్లలో నిర్మాణంలో ఉన్న జిటిఎస్ పనులను, స్వర్ణ భారతి నగర్ లో నిర్మాణం చేసిన కమ్యూనిటి హాల్ ని, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో వ్యర్థాల సేకరణ, రవాణా వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో జిటిఎస్ లు కీలకమైన పాత్ర వహిస్తాయని, అందుకే వీటి నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిర్మాణ పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఏఈలు, డిఈఈలు పరిశీలన చేయాలన్నారు. కాంక్రీట్, సిమెంట్, ఐరన్ మరియు ప్లాస్టరింగ్ సామాగ్రి నాణ్యతను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ఎక్కడైనా ప్రమాణాలు తగ్గితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
నగరం వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా చెత్త రవాణా ప్రక్రియ మరింత పక్కాగా జరగాల్సిన అవసరం ఉందని, జిటిఎస్ లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెత్త రవాణా సమయం తగ్గడమే కాకుండా, వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోకుండా నివారించవచ్చని తెలిపారు. అనంతరం స్వర్ణభారతీ నగర్ మెయిన్ రోడ్ లోని కమ్యూనిటి హాల్ ని పరిశీలించి, పెండింగ్ పనులు పూర్తీ చేసి, నిర్వహణకు టెండర్ పిలవాలన్నారు.
పారిశుధ్య పనులపై అధికారులతో మాట్లాడుతూ, ప్రతి సచివాలయం పరిధిలో డ్రైన్ శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ బి.శ్రీనివాసరావు, ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ శ్రీనివాస్, సతీష్, ఏడీహెచ్ శాంతి, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.




